జగన్‌కు ఓటమి భయం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన తప్పుల వల్ల ఆయనకు

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

* నాయకులను మార్చినా ప్రజలు నమ్మరు

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన తప్పుల వల్ల ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో జగన్‌ ఎన్ని తప్పులు చేసినా భరించి జపం చేసిన నాయకులంతా ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారని చెప్పారు. తిరుగుబాటు నుంచి ప్రజలను మళ్లించడానికి అభ్యర్థులను మారుస్తున్నట్లు నాటకానికి తెరతీశారని తెలిపారు. జగన్‌ ప్రకటించిన 11 మంది వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీల్లో ఒక్కరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. నాయకులను మార్చినంత మాత్రాన జగన్‌ రాత మారదని, ఆయన పాపం పండిందని వ్యాఖ్యానించారు. జగన్‌ అవినీతి, అక్రమాల గుట్టు ఇప్పటికే ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఇంటికి పంపడం గ్యారంటీ అన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మద్యం, ఇసుక స్కామ్‌లకు పాల్పడిన జగన్‌ను ప్రజలు మార్చడం ఖాయమన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి వైసిపికి లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడిన వైసిపి ప్రభుత్వం, ఇప్పటికైనా రాష్ట్ర రాజధాని ఎక్కడుందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలు ప్రశ్నించిన ప్రతిసారీ విశాఖ రాజధానిగా చూపించి రూ.లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. రెడ్ల మోచేతి నీళ్ల కోసం మంత్రులు ఎదురుచూసే దుస్థితి ఉత్తరాంధ్రలో నెలకొందన్నారు. జగన్‌ ఎన్ని నాటకాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

 

➡️