జీడికి మద్దతు ధర ప్రకటించాలి

జిల్లాలో రైతులు పండించిన

మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

జిల్లాలో రైతులు పండించిన జీడి పిక్కలకు మద్దతు ధర రూ.16 వేలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. టెక్కలి సిపిఎం కార్యాలయంలో మండల నాయకులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 80 కేజీల జీడి బస్తాలకు రూ.16 వేలు చెల్లించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. గిట్టుబాటు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీలు బారిన పడి తీవ్రంగా దోపిడీకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడికి గిట్టుబాటు ధరిస్తేనే ఉద్దానం అభివృద్ధి చెందుతుం దన్నారు. జీడి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండించి పరిశ్రమలు అభివృద్ధి చెందుతుందని, తద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఉద్దాన ప్రాంతం, గిరిజన ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే వలసలను నివారించవచ్చునన్నారు. ఏడాది కాలంగా జీడి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పలాస వచ్చిన సందర్భంగా లక్ష సంతకాలతో వినతిపత్రం ఇచ్చామన్నారు. జీడి రైతుల సంఘం ప్రతినిధులతో మంత్రి అప్పలరాజు సమక్షంలో చర్చించి నెల రోజులు అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఆ సారాంశాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం సరికాదన్నారు. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో జీడి రైతులను మోసం చేస్తుందని వారన్నారు. ప్రభుత్వ వైఖరి వెంటనే బహిర్గతం చేసి జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్థానింగా జీడిపిక్కలు కొనుగోలు జరిగిన తరువాతనే విదేశీ పిక్కలు దిగుమతికు అనుమతించాలన్నారు. జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో జీడి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. జీడి, మామిడి పళ్లు, పిక్కల ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి టిడిపి, వైసిపి, జనసేనలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హెచ్‌.ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, బి.వాసు పాల్గొన్నారు.

➡️