టిక్కెట్ల టెన్షన్‌

ఎన్నికల నోటిఫికేషన్‌ సమీపిస్తుండటంతో వైసిపి, టిడిపిల్లో టిక్కెట్ల టెన్షన్‌ మొదలైంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఎన్నికల నోటిఫికేషన్‌ సమీపిస్తుండటంతో వైసిపి, టిడిపిల్లో టిక్కెట్ల టెన్షన్‌ మొదలైంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పోరుకు సై అంది. వైసిపి మాత్రం ఇప్పటివరకు ఒక్క సీటుకూ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాలకు సమన్వయర్తలుగా పిరియా విజయ, దువ్వాడ శ్రీనివాస్‌, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా పేరాడ తిలక్‌ను నియమిస్తూ పార్టీ ఇటీవల జాబితాను వెలువరించింది. అయితే వారెవరూ అభ్యర్థులు కారంటూ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి వాఖ్యలు చేయడంతో వారు ఖరారు కానట్టుగానే భావించాల్సి ఉంటుంది. పలానా నియోజకవర్గానికి పలానా అభ్యర్థికి కచ్చితంగా సీటు వస్తుందని పార్టీ శ్రేణులు చెప్పుకోవడమే గాని అధిష్టానం మాత్రం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. జిల్లాలో మూడు, నాలుగు చోట్ల అభ్యర్థులను మారుస్తారని జోరుగా ప్రచారం సాగింది. వీటిలో ప్రధానంగా ఎచ్చెర్ల, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. వారే మళ్లీ పోటీ చేస్తారా? లేదా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనేది ఇంకా తేల్లేదు. ఇదిఇలా ఉండగా కొద్ది రోజుల కిందట జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాల్లో సమన్వకర్తలను నియమిస్తూ… పార్టీ అధిష్టానం జాబితా విడుదల చేసింది. పార్టీ శ్రేణుల ఊహలకు అందని విధంగా జడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయను ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం అందరిన్నీ ఆశ్చర్యపరిచింది. టెక్కలిలో అప్పటివరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న దువ్వాడ వాణిని తప్పించి మళ్లీ దువ్వాడ శ్రీనుకే బాధ్యతలను అప్పగించింది. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్‌ను నియమించడం ద్వారా అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి పార్టీ ఇటీవల నియమించిన సమన్వయకర్తలంతా అభ్యర్థులు కారంటూ వ్యాఖ్యలు చేయడంతో శ్రేణుల్లో కొంత గందరగోళానికి దారి తీసింది. వీరినీ మళ్లీ మారుస్తారా? లేక కొనసాగిస్తారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. జిల్లాలో ప్రధానంగా పాతపట్నం, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజవర్గాల్లోని వైసిపి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. శాసనస స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పాతపట్నం, ఎచ్చెర్ల ఎమ్మెల్యే రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌లకు వ్యతిరేకంగా ఇటీవల కాలం వరకు నియోజవర్గంలో ఏదో రకమైన అసమ్మతి కార్యకలాపాలు సాగుతూ వచ్చాయి. పార్టీ అధిష్టానం అభ్యర్థుల కసరత్తు ప్రారంభించిన తర్వాత అసమ్మతి వర్గం కొంత వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆయా స్థానాల్లో వారే పేర్లను ప్రకటిస్తే రోడ్డెక్కడం ఖాయమని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. పాతపట్నంలో మేం సిద్ధం… బూత్‌ సిద్ధం సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులెవరు హాజరు కాకపోవడం నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి తీవ్రతను తెలియజేస్తోంది. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే బూత్‌ కమిటీ సభ్యులు సైతం గైర్హాజరు కావడం పరిస్థితి చేయిదాటిపోతుందనడానికి సంకేతంగా కనిపిస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుందో అంతా ఎదురుచూస్తున్నారు. జనసేనతో కలిసి పోటీ చేస్తున్న టిడిపి మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి స్థానం ఖరారు చేయగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌కు ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి బెందాళం అశోక్‌కు బెర్త్‌ కన్ఫర్మ్‌ అయింది. జనసేనలో ఆశావహులు లేకపోవడం, టిడిపిలో గ్రూపుల పోరు లేకపోవడంతో ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను కేటాయించడం టిడిపి తేలికయింది. టిడిపి ప్రకటించబోయే తదుపరి జాబితా ఆ పార్టీకి ఒక పరీక్షలా మారనుంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఆశావహులు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో చాలా తీవ్రంగా టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్న నాయకులు ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి కొంత ఇబ్బందిగా మారనుంది. ఆశావహులకు టిక్కెట్‌ నిరాకరిస్తే మాత్రం వారు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను సైతం ఓడించేందుకు వెనుకాడరు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం రకరకాల సర్వేల ద్వారా సమాచారాన్ని క్రోడీ కరిస్తోంది. మరో వైపు బిజెపితో పొత్తు అంశం తేలకపోవడంతో మలి జాబితా వెలువరించడానికి మరికొద్ది రోజుల సమయం పడొచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలో బిజెపి ప్రభావం ఏమీ లేకపోయినా, జిల్లాలో ఒక్క సీటు కేటాయించకపోయినా ఇతర జిల్లాల్లో కేటాయించే అవకాశం ఉండటంతో టిడిపి వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. దీంతో టిడిపి ఇన్‌ఛార్జులు, ఆశావహులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

➡️