దళారులను నమ్మి మోసపోవద్దు

ధాన్యం విక్రయాల్లో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని

తూనిక యంత్రాలను పరిశీలిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

  • ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది
  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – ఆమదాలవలస

ధాన్యం విక్రయాల్లో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కొరపాం గ్రామ సచివాలయం వద్ద కృష్ణాపురం ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు నిబంధనల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. రైతులు రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం సేకరణ సహాయ ఏజెన్సీలకు అనుసంధానం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల సందేహాలను నివృత్తి చేసి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు శ్రేయస్సే వైసిపి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి సోమరాజు జగన్నాథం, పిఎసిఎస్‌ సిఇఒ గంగు వెంకటరమణ, వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ దువ్వాడ అమర్‌నాథ్‌, సర్పంచ్‌లు ఎన్ని రామచంద్రరావు, మెట్ట ఆనందరావు, పిఎసిఎస్‌ సభ్యులు ఎన్‌.కన్నబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️