నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో, పంటలు చేతికొచ్చే సమయంలో

వినతిపత్రాన్ని అందజేస్తున్న తేజేశ్వరరావు

  • ‘స్పందన’లో కాంగ్రెస్‌ నాయకుల వినతి

* 250 వినతులను స్వీకరించిన జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో, పంటలు చేతికొచ్చే సమయంలో తుపానుతో జిల్లాలోని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పైడి నాగభూషణం, అంబటి కృష్ణ, రెల్ల సురేష్‌ కోరారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 250 వినతులు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిఆర్‌ఒ గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర అధ్యక్షులు ఎ.గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి నివాసం ఉండడానికి ఇళ్లు, ఇళ్లస్థలాలు లేకపోవడంతో తీవ్ర ఇబందులు ఎదుర్కోటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 నుంచి నగరపాలక సంస్థ పరిధిలోని పర్మినెంట్‌ కార్మకులకు సరెండర్‌ లీవులు చెల్లించాలని కోరారు. మందస గిరిజన సంక్షేమ శాఖలో ఎటిడబ్ల్యుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జెఎసి నాయకులు బి.ప్రభాకరరావు, గణేష్‌ వినతిపత్రం అందజేశారు. పెద్దఎత్తున మామ్మాళ్లు వసూలు చేస్తూ డబ్బులు ఇవ్వని వార్డెన్లను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పొందూరు ఎంపిడిఒ సీపాన హరిహరరావుపై పలు పంచాయతీల సర్పంచ్‌లు ఫిర్యాదు చేశారు. మండలంలోని తోలాపికి చెందిన సీపాన హరిహరరావు ఎంపిడిఒగా పనిచేస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పంచాయతీ అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని గోరింట సర్పంచ్‌ చింతాడ శ్రీలక్ష్మి, పిల్లలవలస సర్పంచ్‌ బుడుమూరు పోలినాయుడు, తుంగపేట సర్పంచ్‌ పప్పల వేణుగోపాలం, మలకాం సర్పంచ్‌ జాడ శ్రీనివాసరావు, తాడివలస సర్పంచ్‌ తమ్మినేన మణెమ్మ ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర విఆర్‌ఒపై కొత్తూరుకు చెందిన షావుకారి జోగారావు ఫిర్యాదు చేశారు. వడ్డితాండ్ర రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 6/7 సిలో తనకు 13 సెంట్లు భూమి ఉండగా రికార్డులు తారుమారు చేసి నాలుగు సెంట్లు మాత్రమే చూపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి రికార్డులు సరిచేయాలని కోరారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జెసి నవీన్‌ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలసత్వం చూపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, డిఇఒ వెంకటేశ్వరరావు, డిఎస్‌ఒ వెంకటరమణ, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

 

➡️