నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

సమస్యల పరిష్కారం కోరుతూ

ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు

  • అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలి
  • అక్రమ అరెస్టులకు నిరసనగా వామపక్షాల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమస్యల పరిష్కారం కోరుతూ 42 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమంగా అరెస్టులు చేయడం తగదని, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యాన సోమవారం ధర్నా చేపట్టారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నాయకులతో పాటు అంగన్వాడీలను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. విజయవాడలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వందలాది మంది పోలీసులు టెంట్‌ను తొలగిస్తూ, కరెంట్‌ తీసేసి దీక్షలో ఉన్న వారిపై కనికరం కూడా చూపకుండా, మహిళలనీ చూడకుండా అమానుషంగా వ్యవహరించారని తెలిపారు. సమస్యలపై పోరాడుతున్న మహిళల గొంతు నొక్కే చర్య సరికాదన్నారు. మగ పోలీసులు అంగన్వాడీలపై దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. కవరేజీకి వచ్చిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. సమస్యను సామరస్యపూర్వకంగా చర్చించి, పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం దారుణమన్నారు. అక్రమంగా నిర్బంధించి అంగన్వాడీలను తక్షణం విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించకపోయినా సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జిఒ జారీ చేయడం, నోటీసులు ఇస్తూ బెదిరించడం తగదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలకనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు కె.మోహనరావు, కె.నాగమణి, శ్రీదేవి పాణిగ్రాహి, ఎ.లక్ష్మి, కె.అప్పారావు, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️