న్యాయవాదులు విధుల బహిష్కరణ

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల

ఆమదాలవలస : నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా జిల్లా కోర్టు నుంచి జిల్లాపరిషత్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో డిఆర్‌ఒ గణపతిరావుకు వినతిపత్రం అందజేశారు. ఆమదాలవలస కోర్టులో విధులు బహిష్కరించి బార్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ ఈ చట్టం సామాన్య ప్రజలకు గొడ్డలిపెట్టు వంటిదన్నారు. ఈ చట్టం రద్దు కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15వ తేదీ వరకు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చాపర విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ చట్టం రద్దుకు రాష్ట్రంలోని అన్ని బార్‌ అసోసియేషన్లు ఏకతాటిపై నిలబడి నిరసనలు చేస్తున్నాయన్నారు. సివిల్‌ కోర్టుల పరిధి నుంచి పూర్తిగా లిటిగేషన్‌ తప్పించి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ట్రిబ్యునల్‌కు అధికారిని నియమించి లిటిగెంట్‌ పబ్లిక్‌ ఆస్తిపై హక్కుల పరిష్కార తీర్పును వెలువరించే అధికారం ఇవ్వడం అన్యాయమన్నారు. దీనివల్ల న్యాయవాదుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాము, ఎం.భవానీ ప్రసాద్‌, బిసి న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు, న్యాయవాదులు తమ్మినేని అన్నంనాయుడు, వి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️