పెంచిన స్పెషల్‌ ఫీజులు తగ్గించాలి

పేద విద్యార్థులకు గుదిబండగా

ధర్నా చేస్తున్న విద్యార్థులు

  • ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పేద విద్యార్థులకు గుదిబండగా మారిన డిగ్రీ స్పెషల్‌ ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చందు, బి.హరీష్‌ డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన స్పెషల్‌ ఫీజులను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు ఊరటనివ్వాలన్నారు. విద్య ఒఎస్‌పి యాప్‌ ద్వారా ఫీజులు కట్టడాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యా విధానం అమల్లో భాగంగా పేదలను చదువుకు దూరం చేస్తున్నారని, మార్పుల పేరుతో ఉన్నత విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని విమర్శించారు. కళాశాల అభివృద్ధి పేరిట విద్యార్థుల నుంచి స్పెషల్‌ ఫీజుల రూపంలో వసూలు చేయడం దారుణమన్నారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వమే నిధులు ఇవ్వాలన్నారు. పెద్ద మొత్తంలో ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు చెల్లించలేక చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్‌ ఫీజులు వెంటనే రద్దు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ సురేఖకు వినతిపత్రం అందజేశారు.

 

 

➡️