పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు

శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కిషోర్‌కుమార్‌

  • యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌ కుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్‌ సమీపంలోశ్రీతీ జ్యోతిరావు పూలే పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరెండర్‌ లీవ్‌, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, డిఎలు, పిఆర్‌సి రూపంలో ఉన్న రూ.కోట్లలో ఉన్న బకాయిలను విడుదల చేయాలన్నారు. పిఆర్‌సిలో లోపాలను ఇప్పటికీ సరిదిద్దకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కొత్త పిఆర్‌సి ప్రాతిపదికన 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు హామీలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. దీనికితోడు ప్రతి పోరాట సందర్భంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. అప్రజాస్వామ్య వైఖరి మారాలని, మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని ఊరించి ఆరు వేలు పోస్టులకే పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు వీలుగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తుంటే ఉపాధ్యాయులపై నిర్బంధాలు అక్రమంగా కేసులు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు కె.దాలయ్య, కోశాధికారి బి.రవికుమార్‌, జిల్లా కార్యదర్శులు బి.శంకరరావు, వై.వాసుదేవరావు, జి.నారాయణరావు, బి.గౌరీశ్వరరావు, బి.శారద, ఎం.వి.రమణ, హనుమంతు అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️