ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సమావేశంలో మాట్లాడుతున్న తులసీదాస్‌

  • 16న నిరసనలు
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ తెలిపారు. ఈ నిరసనల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నాయని విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన రైల్వే, టెలికాం, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకులు, ఆయిల్‌ సెక్టార్‌, విద్యుత్‌, రోడ్లు, పోర్టులు తదితర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధరపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే చేపట్టాలని, రిమ్స్‌ హాస్పిటల్‌ను సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ప్రమోట్‌ చేయాలని, వంశధార కాలువ మరమ్మతులు చేసి ఇచ్ఛాపురం వరకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు జి.సింహాచలం, ఎన్‌.షణ్ముఖరావు, కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, సిర్ల ప్రసాద్‌, పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️