బిజెపి రైతు వ్యతిరేకి

కేంద్ర బిజెపి, హర్యానా రాష్ట్ర బిజెపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకి అని,వీ విధానాలకు వ్యతిరేకంగా

ధర్నా చేస్తున్న రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు

ధర్నా చేపట్టిన కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కేంద్ర బిజెపి, హర్యానా రాష్ట్ర బిజెపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకి అని,వీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.చందర్రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ హెచ్చరించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశ వ్యాప్త నిరసన పిలుపులో భాగంగా సిఐటియు, రైతు, కౌలు రైతు, ఐద్వా, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన నగరంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన అన్ని పంటలకూ కనీస మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటం తీవ్రమవుతుందన్నారు. ఈ తరుణంలో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల పోలీసులు కాల్పులు జరపడం దుర్మార్గమన్నారు. ఈ కాల్పుల్లో 21 ఏళ్ల యువ రైతు శుభకరణ్‌ సింగ్‌ మృతి చెందారని, మరో 25 మంది రైతులు గాయాల పాలయ్యారని అన్నారు. ఈ ఘటనకు ముందు 70 ఏళ్ల వయస్సు పైబడ్డ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందారన్నారు. లక్షలాది మంది రైతులు ఆరు మాసాల వరకు అన్ని విధాల పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. కేంద్ర బిజిపి ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తామని, కేసులు ఎత్తేస్తామని చెప్పిన హామీలను ఉల్లంఘించిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం నిర్బంధాలను అమలు చేసి రైతు ఉద్యమంపై అణచివేత చర్యలు దుర్మార్గమన్నారు. రైతులను శత్రువుల్లా చూస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు అడుగుడుగునా సిమెంట్‌ బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు పెట్టించారన్నారు. ఈ క్రమంలో హర్యానా పోలీసులు రబ్బర్‌ బులెట్లు, టియర్‌ గ్యాస్‌ ఫిరంగులను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. హర్యానా ప్రభుత్వ దాష్టీకానికి ఇంతకుముందు ఇద్దరు రైతులు గుండె ఆగిచని పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై మోడీ ప్రభుత్వ దుర్మార్గానికి ఇది నిదర్శనమన్నారు. ఢిల్లీలో రైతాంగ పోరాట సందర్భంగా 2014లో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని ప్రధాని మోడీ హామీని నిలబెట్టుకోలేదన్నారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలన్నారు. అన్ని బ్యాంకింగ్‌ సంస్థల నుంచి ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ చట్టం, విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రైతు చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎఐసిసిీటియు, ఐద్వా, బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, నాగార్జున అగ్రికం, విఆర్‌ఎ పెన్షనర్లు, భవనం, జన విజ్ఞాన వేదిక, మెడికల్‌ రిప్స్‌, ప్రజా సంఘాల నాయకులు కె.నాగమణి, అల్లాడ లక్ష్మి, శ్రీదేవిపాణిగ్రాహి, సురేష్‌ ఎం.గోవర్థనరావు, కె.చంద్రశేఖర్‌, టి.త్రినాథరావు, ఎల్‌.వరదరాజు, వై.గోపాలుడు, కె.అప్పారావు, డి.పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి, వెంకట్‌, ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. మందస : న్యాయ సమ్మతమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా హర్యానా పోలీసు కాల్పుల్లో అమరుడైన శుభకరంసింగ్‌ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి డిమాండ్‌ చేశారు. రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యాన మందస రాధాకృష్ణాపురం రైస్‌ మిల్లుల కూడలి వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి యం.ధర్మారావు, రైతు, కార్మిక సంఘాల నాయకులు టి.లక్ష్మీనారాయణ, కె.కేశవరావు, బి.దుర్యోధన, ఆర్‌.ఏకాశి, బి.వెంకటేశం, పి.దేవేంద్ర, ఎ.కృష్ణారావు, బి.లచ్చయ్య, బి.పోలయ్య, కె.బాలకృష్ణ, లచ్చుమయ్య, కె.కృష్ణారావు పాల్గొన్నారు.

 

➡️