మున్సిపల్‌ కార్మికులపై నిర్లక్ష్యం తగదు

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల పట్ల నిర్లక్ష్య దోరణి అవలంభిస్తోందని, 10 రోజులుగా సమ్మె

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న కృష్ణమూర్తి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల పట్ల నిర్లక్ష్య దోరణి అవలంభిస్తోందని, 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేక మొద్దు నిద్ర ప్రదర్శించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన నిరవధిక సమ్మెలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ శిబిరంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి గత ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయత్రలో, అథికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాని డిమాండ్‌ చేశారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన సమ్మెకు సంఘీభావం తెలిపారు. తేజేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ (ఆప్కాస్‌) కార్మికులందరిని పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి యన్‌.బలరాం, యూనియన్‌ నాయకులు కళ్యాణ రాజు, ఆకుల శంకర్‌, అరుగుల రాము, ఎ.శేఖర్‌, బి.గణేష్‌, డి.సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.ఆమదాలవలస: పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకోవడంతో పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రభుత్వ తీరుకు నిరసనగా మానవహారం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేస్తూ పట్టణ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మిక నాయకులు తాడి సంతోష్‌, కె.తారకేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, జె.శ్రీను పాల్గొన్నారు.పలాస : సిఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు గురువారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పదో రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి పలాస మున్సిపల్‌ కార్యాలయం వరకు పారిశుధ్య కార్మికులు అర్ధనగంగా ర్యాలీ చేపట్టారు. కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్‌, శ్రీనివాసరావు, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, ఎం.రవి, దివాకర్‌, ఎస్‌.శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ ముఖి, సీతమ్మ, గులాబీ, సావిత్రి, లక్ష్మి పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : పది రోజులుగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

 

➡️