మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

వచ్చే సాధారణ ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల్లో

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

వచ్చే సాధారణ ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించే భవనాలకు చెందిన శాఖల అధికారులు, ఇఆర్‌ఒ, ఏఇఆర్‌ఒలతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి బుధవారం కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్‌, పోలింగ్‌ గదిలోనూ, ఓటర్లు వరుసలో నిలబడే ఆ ప్రాంగణంలోనూ తగిన విధంగా విద్యుత్‌ సౌకర్యం, లైటింగ్‌, తాగునీరు, మరుగుదొడ్లు, వికలాంగుల కోసం ర్యాంప్‌ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ పనులను 29లోగా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యవసాయ, జిల్లా పరిషత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, వివిధ సంక్షేమశాఖలకు చెందిన భవనాలు ఉన్నందున ఎన్నికల సెక్టార్‌ ఆఫీసర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఆ భవనాలను తనిఖీ చేసి పనులు పూర్తయినట్లు నివేదికను అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఉప కలెక్టర్లు జయదేవి, పద్మావతి, వివిధ శాఖల అధికారులు అర్‌.జయప్రకాష్‌, బి.శాంతిశ్రీ, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️