రాష్ట్రంలో విధ్వంస పాలన

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విధ్వంస పాలన

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌

  • రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు కదులుతున్న జనం
  • మాట తప్పిన జగన్‌కు గుణపాఠం తప్పదు
  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విధ్వంస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అరాచక పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో మొదలైందన్నారు. అందువల్లే తెలుగుదేశం ఇచ్చిన రా.. కదలిరా పిలుపునకు… చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో జగన్‌ 632 హామీలు ఇచ్చి మాట తప్పారని అందువల్లే అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేయగా, నేడో రేపో 108, 104 ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని చెప్పారు. నాడు హామీలు ఇచ్చిన జగన్‌ తెరచాటున దాగి ఉంటే సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త హామీలు ఇచ్చి మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో మాట తప్పిన వారిని చీపుర్లతో కొట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన జగన్‌కు ఇప్పుడు ఎలా గౌరవించాలో ఆయనే చెప్పాలన్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కాలంలో రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆదాయం, తెచ్చిన అప్పులు వెరసి రాస్ట్రానికి రూ.25 లక్షల కోట్లు సమకూరితే అందులో కేవలం సంక్షేమ పథకాలకు రూ.రెండున్నర లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ.22.50 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. దోపిడీ, విధ్వంసం తప్ప ప్రజల జీవితాలు బాగుపడలేదన్నారు. నిత్యావసరాలు, కరెంట్‌ ఛార్జీలు విపరీతంగా పెంచారని… పండగ చేసుకునే పరిస్థితి పేదల ఇళ్లల్లో లేదన్నారు. తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని హత్య చేసిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. వైసిపిలో బిసికి పదవి తప్ప పవర్‌ ఉండదని ఆ పార్టీ ఎంపీలే చెప్తున్నారని తెలిపారు. జిల్లాలో గౌరవప్రదమైన స్పీకర్‌ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం ఆ పదవికి కళంకం తెచ్చారని చెప్పారు. పదవి కోసం విలువలను మంటగలిపిన సీతారాంకు ఇప్పుడు టిక్కెట్‌ ఇవ్వనని చెప్తున్నారని తెలిపారు. అంగన్వాడీలకు టిడిపి ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. మాట తప్పిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బొణిగి భాస్కరరావు, సింతు సుధాకర్‌, మాదారపు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️