రైతులపై కక్షసాధింపు

మూలపేట అదానీ పోర్టు రోడ్డు నిర్మాణ భూసేకరణలో రెవెన్యూ అధికారుల తీరుపై కోర్టును

చదును చేసిన పంట పొలం

  • పోర్టు రోడ్డు భూముల్లో పంటలు ధ్వంసం
  • భూసేకరణ పరిధిలోకి రాని 50 సెంట్ల పంట పొలం చదును

ప్రజాశక్తి – టెక్కలి

మూలపేట అదానీ పోర్టు రోడ్డు నిర్మాణ భూసేకరణలో రెవెన్యూ అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించిన బన్నువాడకు చెందిన ఇద్దరు రైతుల పంట భూములను రాత్రికి రాత్రే అధికారులు బుల్డోజరుతో ధ్వంసం చేశారు. పోర్టు రోడ్డు నిర్మాణంలో భాగంగా బన్నువాడ, తలగాం, వేములాడకు చెందిన రైతుల నుంచి అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారుల తీరుపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు బన్నువాడకు చెందిన కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షులు పోలాకి ప్రసాదరావు, వట్టికూళ్ల కీర్తికుమార్‌ కారణమని రెవెన్యూ అధికారులు భావించారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనివారం రాత్రి బుల్డోజరుతో కీర్తికుమార్‌కు చెందిన 1.10 ఎకరాలు, ప్రసాదరావుకి చెందిన 79 ఎకరాల అపరాల పంటను ధ్వంసం చేశారు. భూసేకరణలో కీర్తికుమార్‌ది 60 సెంట్లు సేకరించగా, అదనంగా మరో 50 సెంట్ల పంటను ధ్వంసం చేశారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములకు సంబంధించిన నష్టపరిహారం శుక్రవారం జమ కావడంతో భూములను చదును చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కీర్తికుమార్‌కు చెందిన భూసేకరణ పరిధిలోకి రాని 50 సెంట్లను ధ్వంసం చేయడంపై తహశీల్దార్‌ ప్రవళ్లికను వివరణ కోరగా, తనకేం తెలీదని చెప్పారు. కక్షసాధింపుతోనే అధికారులు పంటలను ధ్వంసం చేశారని రైతులు మండిపడుతున్నారు.

 

➡️