సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె

అంగన్వాడీలకు ఇచ్చిన

కొత్తూరు : నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

  • నేడు జైల్‌భరో
  • 28వ రోజుకు అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. ఎస్మా ప్రయోగించినా తగ్గేది లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 28వ రోజుకు చేరింది. నగరంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద అంగన్వాడీలు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్ష మూడో రోజు సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడీలు 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మరోవైపు అణచివేత పద్ధతులను అవలంభిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసు అని భావించినప్పుడు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. సమ్మెలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక, అనుబంధ సంఘాలు జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఎ.కనక నాగరత్నం, బసవ యోగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో ఎస్మా ఎత్తివేయాలని కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, గొండు నీలన్న తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని నిరసిస్తూ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.హేమలత, ధనలక్ష్మి, అమ్మాయమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిర్ల ప్రసాదరావు, నిమ్మక అప్పన్న తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ నంబరు 2 ప్రతులను దహనం చేశారు. సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి ఎల్లయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, రమణమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో జిఒ నంబరు 2 ప్రతులను దహనం చేసి నినాదాలు చేశారు. ఐలు రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డేపల్లి మోహనరావు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, మొదలవలస లత, మాధవి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. రణస్థలం మండల కేంద్రంలో సిపిఎం నాయకులు వెలమల రమణ అధ్యక్షతన సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్మాను రద్దు చేయకపోతే వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపుతామని హెచ్చరించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కె.సింహాద్రి నాయుడు, టిడిపి మాజీ మండల అధ్యక్షులు డి.జి.ఎం ఆనందరావు, పిన్నింటి భానోజీ నాయుడు, జనసేన మండల అధ్యక్షులు బస్వా గోవిందరెడ్డి, దాసరి బలరాం, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం మండల అధ్యక్షులు వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం, పలాస, పొందూరులో సమ్మె శిబిరాల్లో నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత, పైడితల్లి, అనురాధ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

➡️