సిఎం పర్యటనను విజయవంతం చేయాలి

ఈనెల 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి – పలాస, నరసన్నపేట

ఈనెల 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. పలాసలోని రైల్వే క్రీడా మైదానంలో మంత్రి అప్పలరాజు మంగళవారం విలేకరులతో మాట్లాడగా, కృష్ణదాస్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. కంచిలి మండలం మకరాంపురంలో వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుని, పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను సిఎం జగన్‌ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే 60 ఎకరాల్లో నిర్మించనున్న ఇండిస్టియల్‌ పార్కుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడడం, మృత్యువాత పడుతుండడంతో ఈ ప్రాంతంలో కిడ్నీ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్‌ నాలుగేళ్ల కిందట శంకుస్థాపన చేసి, ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఉద్దాన ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశామన్నారు. పాదయాత్రలో ఈ ప్రాంతవాసుల కష్టాలను తెలుసుకున్న జగన్‌, కిడ్నీ వ్యాధి నివారణకు రూ.700 కోట్ల వ్యయంతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు వైఎస్సార్‌ సుజలధార మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. పలాస నియోజకవర్గంలో రెండు పిహెచ్‌సిలు, మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, నాలుగు జూనియర్‌ కళాశాలలు, పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన రైల్వే వంతెన, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు నేడు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. తిత్లీ తుపాను పరిహారం రెట్టింపు సాయం అందించామన్నారు. మత్స్యకారుల కోసం నువ్వులరేవు, మంచినీళ్లపేట మధ్యలో హార్బర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూలపేట పోర్టును మంజూరు చేయడమే కాక పనులు శరవేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి ప్రదాత, దశాబ్దాల తరబడి ఉన్న కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్న జగన్‌ పర్యటనకు జిల్లావ్యాప్తంగా ప్రజలు, వైసిపి శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం పలాస మున్సిపల్‌ కార్యాలయం, మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రయివేటు స్కూళ్ల ఉపాధ్యాయులు, రియల్‌ ఎస్టేట్‌, వ్యాపారసంఘాల నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. సిఎంకు ఘన స్వాగతం పలికేందుకు తరలిరావాలని కోరారు. సమావేశంలో కళింగ, కళింగ వైశ్య కార్పొరేషన్ల చైర్మన్లు పేరాడ తిలక్‌, అంధవరపు సూరిబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ బి.గిరిబాబు, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రతినిధి పి.శ్రీనివాసరావు, వైసిపి నాయకులు హనుమంతు వెంకటరావు, ఎఎంసి చైర్మన్‌ పి.వి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️