సైకో పాలనతో రాష్ట్రం అతలాకుతలం

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన

కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తున్న అచ్చెన్నాయుడు

  • మరో అవకాశం ఇస్తే అరాచకాలే
  • టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సైకో పాలనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కోటబొమ్మాళి టిడిపి కార్యాలయం నుంచి జైత్రయాత్ర పేరిట బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ముందువరుసలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ద్విచక్ర వాహనంపై వెళ్లగా, చైతన్యరథంలో కార్యకర్తలు, ప్రజలకు అచ్చెన్నాయుడు అభివాదం చేశారు. పెద్దసంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో ప్రారంభమైన ర్యాలీ సంతబొమ్మాళి, టెక్కలిలో సాగి నందిగాంలో ముగిసింది. ఆయా చోట్ల అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్‌కు మరో అవకాశం ఇస్తే నియంతృత్వం, అరాచక పాలనకు అవకాశం ఇచ్చినట్లేనన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదేళ్లు పరిపాలించడం సిగ్గుచేటు అన్నారు. జగన్‌ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఆయనలో మార్పు రాలేదన్నారు. సంక్షేమం పేరిట ప్రజలపై ధరలు, పన్నుల భారాలను మోపారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి అణగదొక్కాలని చూశారని విమర్శించారు. చివరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినా అరెస్టులు చేసే నియంత పాలన రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ఇదే ఉత్సహంతో మరో వంద రోజులు కష్టపడి పనిచేస్తే టిడిపి విజయకేతనం ఎగురవేస్తామన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకమ్రంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, నాయకులు బోయిన రమేష్‌, పినకాన అజరుకుమార్‌, బగాది శేషగిరి, జీరు భీమారావు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కె.హరివరప్రసాద్‌, రెడ్డి అప్పన్న, కర్రి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️