10న అఖిల భారత కోర్కెల దినం

అఖిల భారత కోర్కెల దినాన్ని

సమావేశంలో మాట్లాడుతున్న తేజేశ్వరరావు

  • దేశవ్యాప్త నిరసనల్లో భాగస్వాములు కావాలి
  • సిఐటియు నాయకుల పిలుపు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అఖిల భారత కోర్కెల దినాన్ని పురస్కరించుకుని ఈనెల పదో తేదీన దేశవ్యాప్త నిరసనల్లో జిల్లాలోని కార్మికులు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంఘ జిల్లాస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన కేంద్రం, రాష్ట్రంలోని గత ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రంలో బిజెపికి బలాన్ని బాగా తగ్గించారని తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపి తన పాత విధానాలనే కొనసాగించడానికి సిద్ధమవుతోందన్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) సకాలంలో చెల్లించని యజమానులకు వేసే జరిమానాపై రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనివల్ల రాబోయే కాలంలో యజమానులు పిఎఫ్‌ బకాయిలు సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం యజమానులకు తొత్తు అని ఎన్నికలు అయిన వెంటనే రుజువు చేసుకుందన్నారు. అన్నింటికంటే ప్రమాదకరమైన లేబర్‌ కోడ్‌లను అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలిపారు. లేబర్‌ కోడ్‌లు అమలైతే సమ్మెలు చేయడం కూడా సాధ్యం కాదన్నారు. పనివేళలు పెంచడం, ఉన్న హక్కులు తొలగించడం, జీతాలు పెంచకపోవడం, నిర్భంధాన్ని తీవ్రతరం చేయడం యాజమాన్యాలకు సులువు అవుతుందని చెప్పారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, సేంద్రీయ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు నెలకు రూ.26 వేలు చొప్పున నిర్ణయించి అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ తదితర ఉద్యోగ, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్‌ ఫోమ్‌ ఫైర్‌ ఇంజన్‌ ఏర్పాటు చేయాలన్నారు. శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ రింగ్స్‌ యాజమాన్యం తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేశారు. రిమ్స్‌ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. నీలం జ్యూట్‌ పరిశ్రమను వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేశారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌, రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అరబిందో, మందస రైస్‌మిల్లు కార్మికుల ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, జిల్లా కార్యదర్శులు ఎన్‌.గణపతి, ఎస్‌.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️