20 నుంచి సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె

సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

ఎపిసికి నోటీసు అందజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

* ఎపిసికి సమ్మె నోటీసు అందజేత

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈనెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సిఆర్‌ఎంటి యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.టి నాయుడు, బి.గిరిధర్‌ తెలిపారు. జెఎసి ఆధ్వర్యాన సమగ్ర శిక్ష కార్యాలయంలో ఎపిసి రోణంకి జయప్రకాష్‌ను మంగళవారం కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రావాల్సిన జీతాల బకాయిలు సకాలంలో చెల్లించి క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేయనున్నట్లు చప్పారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ను అమలు చేసి, వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వేతనాలు చెల్లించాలని కోరారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో జెఎసి నాయకులు ఎంఐఎస్‌ యూనియన్‌ అధ్యక్షులు పైడి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ యూనియన్‌ అధ్యక్షులు రాము, ఉషారాణి, ఐఆర్‌టి నాయకులు భానుప్రకాష్‌, అకౌంటెంట్‌ యూనియన్‌ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.

 

➡️