22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన

జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన నుంచి గతేడాది డిసెంబరు 9 వరకు వచ్చిన క్లయిమ్‌ల పరిశీలన పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. ఈనెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ ఛాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 28వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ శాతం పెంచేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశామన్నారు. వాటితో సంబంధం లేకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు దరఖాస్తు చేసుకునే వారి మార్పులు, చేర్పుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి ప్రాముఖ్యమైనదని, ఓటు విలువ తెలియజేసి పోలింగ్‌ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో వైసిపి నాయకులు ఎస్‌.సత్యనారాయణ, టిడిపి నాయకులు కె.వి రామరాజు, బిజెపి నాయకులు పి.సురేష్‌బాబు, బిఎస్‌పి నాయకులు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️