5న ఎండిఎం కార్మికుల చలో విజయవాడ

మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు పెంచాలని, వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎండిఎం కార్మికులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు పెంచాలని, వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి ఐదో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి తెలిపారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో చలో విజయవాడ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉత్తర, సుశీలతో కలిసి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలల విలీనం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. డ్రాపౌట్స్‌ తగ్గించాలని, పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే మధ్యాహ్న భోజన పథక లక్ష్యాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు పెంచకపోగా తగ్గించిందన్నారు. పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90 : 10 శాతాన్ని మోడీ ప్రభుత్వం 60 : 40 శాతానికి తగ్గించిందన్నారు. రోజులు 7, 8 గంటలు శ్రమిస్తున్న కార్మికులకు యూనియన్‌ పోరాటంతో రూ.మూడు వేల గౌరవ వేతనం సాధించుకున్నట్లు తెలిపారు. పథకానికి బడ్జెట్‌ పెంచాలని, ప్రయివేటు సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వి.లక్ష్మి, కె.అన్నపూర్ణ, కె.నారాయణమ్మ, ఎం.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️