5న ఓటర్ల తుది జాబితా విడుదల

ముసాయిదా ఓటర్ల జాబితాలో

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల అనంతరం ఓటర్ల తుది జాబితాను జనవరి ఐదో తేదీన వెలువరించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు వెల్లడించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబరులో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అంశాల వారీగా సమీక్షించారు. పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుని, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 9వ తేదీతో తుది గడువు ముగిసిందన్నారు. 50 వేలకు పైగా దరఖాస్తులు చివరి వారం రోజుల్లో వచ్చాయని, ఈనెల 26వ తేదీ నాటికి వాటి పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పుల అనంతరం వచ్చే నెల 5వ తేదీన తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అర్హత ఉన్న వారు ఓటు హక్కు పొందేందుకు మాత్రం ఫారం-6ను నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఇవ్వవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాటిని పరిశీలించి, నామినేషన్లకు పది రోజుల ముందు ప్రచురించే అనుబంధ (సప్లిమెంట్‌) జాబితాలో చేర్చుతామని వివరించారు. పేర్ల తొలగింపునకు సంబంధించి, ఇప్పటికే ఆయా వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్‌ నాయకులు డి.మల్లిబాబు, బిజెపి నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, బిఎస్‌పి నాయకులు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️