వెంటాడుతున్న తాగునీటి సమస్య

మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య

లక్ష్ముడుపేట పంచాయతీలో నేలపై పడి ఉన్న కుళాయి పైపు

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. ప్రధానంగా డి.మత్స్యలేశం, బడివానిపేట, బుడగట్లపాలెం పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది. ఇక్కడ భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపడటం లేదు. మరోపక్క హస్తంపురం, లక్ష్ముడుపేట, షేర్‌ మహమ్మద్‌ పురం, అరుణమెక్కివలస, చిలకపాలెం ప్రాంతాల్లో సైతం తాగునీటి సమస్య ఉంది. సింగూరు సమీకృత మంచినీటి పథకం నుంచి నీటి సరఫరా ఉదయం కొన్ని గంటలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మరోపక్క సుజలదార పథకం ద్వారా కొన్ని గ్రామాలకు మాత్రమే పైప్‌లైన్‌ వేశారు. కుళాయిలు సక్రమంగా లేకపోవడం, పైప్‌లైన్‌ లీకేజ్‌ సమస్యలు కూడా తాగునీటికి కారణమవుతున్నాయి. చాలా గ్రామాల్లో చేతిపంపుల మీద ప్రజలు తాగునీటికి ఆధారపడుతున్నారు. మరికొన్ని పంచాయతీల్లో చేతిపంపులు మరమ్మతులైతే తక్షణం మరమ్మతులు చేయలేకపోతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

30 కుటుంబాలకు ఒకే కుళాయి

తమ గ్రామంలో ఎప్పటికప్పుడు మంచినీటి సమస్య తలెత్తుతుంది. పైపులు మర మ్మతులకు గురవ్వడంతో నీళ్లులేక పలు బోర్లు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. గతంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. సుమారు 20 నుంచి 30 కుటుంబాలు ఒకే కొళా యిపై నీటి కోసం ఆధార పడుతున్నాం.

– రేళ్ల సూరీడమ్మ, షేర్‌ మహమ్మద్‌పురం

నీటి సమస్య ఎక్కువగా ఉంది

తమ గ్రామంలో వాటర్‌ ట్యాంకులు మరమ్మతులకు గురవ్వడంతో మంచినీటి సమస్య అధికమైంది. ఇక్కడ ప్రధానంగా ఉప్పునీరు సమస్య ఉండటంతో తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నాం. పైపులైన్లు వేసి అర్థాంతరంగా నిలిపివేశారు. దీంతో నీటికోసం అవస్థలు పడుతున్నాం.

– కారి గడ్డెమ్మ, డి.మత్స్యలేశం

 

➡️