పట్టించుకోని ‘కోట’

అధికార వైసిపిలో నెలకొన్న గ్రూపుల గోల వైసిపి అభ్యర్థి, స్పీకర్‌

ఓటు వేయాలని గోవిందరావును అభ్యర్థిస్తున్న సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

అధికార వైసిపిలో నెలకొన్న గ్రూపుల గోల వైసిపి అభ్యర్థి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రచారానికి పార్టీలోని అసమ్మతి నాయకులు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసిపిలో సువ్వారి గాంధీ, కోట గోవిందరావు, చింతాడ రవికుమార్‌లు స్పీకర్‌ తమ్మినేని సీతారాంను విభేదించి గత కొంత కాలం నుంచి వేరువేరు కార్యక్రమాలు చేపట్టడం పాఠకులకు విధితమే. ఇటీవల గాంధీ వైసిపికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. చింతాడ రవికుమార్‌ ఇచ్చాపురం నియోజకవర్గ పరిశీలకునిగా తనవంతు పాత్ర పోషిస్తూ ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రచారానికి కొంత దూరంగా ఉన్నారు. అలాగే కోట గోవిందరావు కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. శుక్రవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండలంలోని తమ్మయ్య పేటలో ప్రచారం నిర్వహించారు. సీనియర్‌ వైసిపి నాయకులు గోవిందరావు ఇంటికి వెళ్లి తమ్మినేని సీతారాం రానున్న ఎన్నికల్లో ఓటు వేయమని అభ్యర్థించి చేతులు జోడించి నమస్కరిస్తున్నప్పటికీ కోట మాత్రం పోస్టర్‌ను చదువుతూ ప్రతి నమస్కారం కూడా చేయకపోవడం ప్రచారంలో పాల్గొన్న వైసిపి కార్యకర్తలు, నాయకులకు ఖంగుతిన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట గోవిందరావు భార్య కృష్ణకుమారి వైసిపి తరఫున ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ స్పీకర్‌ సీతారాం ఆమెను ఓడించి టిడిపి తరఫున పోటీ చేసిన సొంత వదిన తమ్మినేని భారతిని గెలిపించి కోట గోవిందరావుకు చెక్‌ పెట్టారని కోట అభిమానులు చెబుతున్నారు. నేడు స్పీకర్‌ కోట గోవిందరావు స్వగృహానికి వెళ్లి ఓటు అభ్యర్థించినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంతో స్పీకర్‌ అవమాన భారంతో వెనుతిరిగారని అదే తమకు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఓటమిని చూసిన తమ్మినేనికి నేడు తగిన శాస్తి జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూసే వరకు తమకు మనశ్శాంతి లేదని పలువురు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే తమ్మినేని శాసనసభలో తన కనుసైగ ఆదేశాలతో శాసించిన సభాపతి నియోజకవర్గంలోని వైసిపి గ్రూపులను అదుపు చేసుకోవడంలో విఫలమయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు.

 

➡️