నాగావళి ఎడమ కాలువ అభివృద్ధికి కృషి

నాగావళి ఎడమ కాలువను

పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ప్రజాశక్తి – బూర్జ

నాగావళి ఎడమ కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతానని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హామీనిచ్చారు. మండలంలోని నారాయణపురం ఆనకట్టతో పాటు నాగావళి ఎడమ కాలువను మంగళవారం పరిశీలించారు. ఏటా ఎడమ కాలువ ద్వారా భూములకు సాగునీరందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ కాలువ నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, బూర్జ మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు సాగునీరందేదని తెలిపారు. కొంతకాలంగా కాలువల పరిస్థితి దయనీయంగా ఉండడంతో సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పూర్తిస్థాయిలో కాలువను అభివృద్ధి చేసి శివారు భూములకూ సాగునీరందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఇ సుధాకర్‌ను కాలువ పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో కొంతవరకు కాలువ పనులు చేపట్టామని, అప్పట్లో పూర్తిస్థాయిలో పనులు జరగలేదన్నారు ఈ ఏడాది ఇప్పటికే కాలువలో పూడికలు తీసి జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాల్సి ఉందన్నారు. కాలువ అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని సూచించారు. అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డిఇఇ మురళీమోహనరావు, జెఇ రాంబాబు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️