ప్రతి శుక్రవారం డ్రై డే

ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

దోమల నిర్మూలనతో డెంగీ నివారణ

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ సూచించారు. ఈనెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు డెంగీ నివారణ మాసోత్సవాలు సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుందని తెలిపారు. ఇంట్లో వాడని పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పూలకుండీలు, ఫ్రిజ్‌లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చని చెప్పారు. ప్రతిఒక్కరూ దోమతెరలను వాడాలన్నారు. డెంగీ నివారణకు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే డెంగీ నివారణ సాధ్యమన్నారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ డెంగీ జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. జిల్లా మలేరియా నివారణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ డెంగీ వైరస్‌ను వ్యాపింపజేసే దోమలు పగలు, రాత్రి తేడా లేకుండా కుడతాయని తెలిపారు. వ్యాధులను నివారించడానికి ఉత్తమ మార్గం దోమల కాటు నుంచి రక్షించుకోవడమేనన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహనరావు, డిఐఒ శ్రీదేవి, డిపిఎంఒ జి.వి లక్ష్మి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరావు, మలేరియా కన్సల్టెటంట్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️