24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనెల 24 నుంచి జూన్‌

మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చిలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, అదే స్ఫూర్తితో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సహకరించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 51 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 23,668 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చిలో ఉదయం వేళ మాత్రమే పరీక్షలు నిర్వహించామని, ఇప్పుడు రెండు పూటలూ నిర్వహిస్తున్న నేపథ్యంలో వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్‌, ఇతర సదుపాయాలు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తుతో పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. వైద్యారోగ్యశాఖ పారా మెడికల్‌ సిబ్బందితో పాటు అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు చేరుకునేలా ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్‌ కొనసాగేలా ఎపిఇపిడిసిఎల్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాలు సకాలంలో స్వీకరించేలా తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు, జిల్లా ఒకేషనల్‌ విద్యాశాఖాధికారి, పరీక్షల ప్రత్యేక అధికారి కె.ప్రకాశరావు, డిఇసి బి.శ్యామసుందర్‌, కె.తవిటినాయుడు, జి.సింహాచలం, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️