ఎడారులను తలపిస్తున్న చెరువులు

భానుడు భగభగమంటూ తన విశ్వరూపాన్ని

లక్కుపురంలో ఎండిపోయిన చెరువులో బురదనీరు తాగుతున్న ఆవు

నీటిఎద్దడితో విలవిల్లాడుతున్న మూగజీవాలు

ప్రజాశక్తి- బూర్జ

భానుడు భగభగమంటూ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. ఒకవైపు ప్రచండమైన ఎండలతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అధికస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. మరోవైపు వడ గాల్పులకు తట్టుకోలేక ఉపశమనం కోసం చెట్టు నీడకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా మండలంలో సుమారు 220 తాగునీటి, సాగునీటి చెరువులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం 140 చెరువుల వరకు పూర్తిగా ఎండి పోయాయని మండల ప్రజలు చెబుతున్నారు. మండలంలోని చీడివలస, కొల్లివలస, నీలంపేట, అన్నంపేట, లక్కుపురం, యుపిపేట, తోటవాడ తదితర గ్రామాల్లోని చెరువులు పూర్తిగా ఎండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడంతో తాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయని దీంతో తమకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా గుక్కెడు నీరు కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూగజీవాలకు నిలువు నీడలేక, తాగునీరు అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని తెలిపారు. మూగజీవాలు నీటిఎద్దడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరోవైపు తీవ్రమైన ఎండలను తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. మూగజీవాల పరిరక్షణ కోసం, వాటి దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యమ్మయ చర్యలు చేపట్టాలని, మూగజీవాల రక్షణకు శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా ప్రజల అవసరాల కోసం తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

 

➡️