రూ.లక్షలు వృథా… తాగునీటి వ్యథ

పలాస మండలం సున్నాడలో సుమారు

తాగునీటి ట్యాంకు

సున్నాడలో దాహం కేకలు

పట్టించుకోని అధికారులు

ఆ గ్రామంలో తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. ఎన్నో ఏళ్లుగా తాగునీరు కోసం తిప్పలు తప్పడం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గుర్తించి పాలకులు, అధికారులు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు మూలకుచేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు భూగర్భ జలాలు అడుగంటిపోగా, మరోవైపు అర కిలోమీటరు దూరానికి వెళ్లి నీటిని తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు స్పందించకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజాశక్తి- పలాస

పలాస మండలం సున్నాడలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామానికి రెండు బావులు, మూడు బోర్లు ఉన్నాయి. వాటి పైనే ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఒకేఒక్క బోరు పని చేస్తుండగా, రెండు బావులు పూర్తిగా అడుగంటి పోయాయి. దీంతో తాగునీరు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సుమారు పన్నెండు ఏళ్లు క్రితం రూ.3.50 లక్షల వ్యయంతో నీటి పథకం ఏర్పాటు చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న నేల బావి నుంచి పైపులైన్‌ ద్వారా కుళా యిలతో నీటిని సరఫరా చేశారు. ఆ పథకం మూలకు చేరడంతో అప్పటి ఎమ్మెల్యే జుత్తు జగన్నా యకులు మరో రూ.16 లక్షల వ్యయంతో తాగునీటి ట్యాంకు నిర్మాణం చేపట్టారు. పాత కుళాయిలకు అనుస ంధానం చేసి పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేశారు. ఆ పథకం కూడా మూడునాళ్ల ముచ్చటగా తయారైంది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. దీంతో తాగునీరు కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షల వ్యయంతో నీటి పథకాలు ఏర్పాటు చేసిన తాగునీటి కష్టాలు ప్రజలకు తప్పడం లేదు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ట్యాంకుల ద్వారా సరఫరా నిల్‌గతంలో వేసవి సమీపిస్తున్న తరుణంలో ఏయే ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని గుర్తించి ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేసేవారు. ఆ గ్రామంలోని జనాభా ప్రాతిపదికన రెండు పూటలు నీటిని సరఫరా చేసేవారు. అయితే సుమారుగా ఐదేళ్లుగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడం మానేశారు. దీంతో ప్రజలకు నీటికష్టాలు తప్పడం లేదు. తాగునీటి కోసం గ్రామ సమీప ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల నేల బావి, బోర్లు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు ఎండిపోవడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని, మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. నీటి కోసం ఎక్కడకు వెళ్లాలో? ఏమి చేయాలో? అర్థం కాక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు చొరవ చూపి గ్రామానికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ దుర్యోధనకు వివరణ కోరగా గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందనే మాట వాస్తవమే అన్నారు. మరోరెండు రోజుల్లో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకం ద్వారా తాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు పాత తాగునీటి పథకాన్ని సరిచేసి నీరు అందేలా చూస్తామని చెప్పారు. పాడైన బోర్లకు మరమ్మతులు చేపడతామని తెలిపారు.

 

➡️