ప్రజా తీర్పును శిరసావహిస్తా

ప్రజాస్వామ్యంలో ప్రజలే

సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం

  • తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – ఆమదాలవలస

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ప్రజల కోసం అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసినట్లు తెలిపారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసినా ఎన్నికల్లో ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడం బాధాకరమన్నారు. ఆమదాలవలస నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినా, ప్రజలు ఇలా తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల ఫలితాలు తనను చాలా నిరాశపరిచాయని చెప్పారు. వైసిపి ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలను తాము బేరీజు వేసుకుంటామని తెలిపారు. ఓటమిపై వైసిపి శ్రేణులు అధైర్యపడొద్దన్నారు. అందరం సమిష్టిగా పార్టీ కోసం పనిచేసి, పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులను నడుచుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, వైసిపి నాయకులు కోట గోవిందరావు, కోట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️