పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పని

పరిశ్రమల్లో భద్రతా

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • సరిపరిశ్రమలకు కేటాయించిన భూమి వివరాలు ఇవ్వాలి
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఇండిస్టీస్‌ అండ్‌ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివాలని స్పష్టం చేశారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఎపిఎంఐపి ద్వారా కేటాయించిన భూములతో పాటు వాటి ప్రస్తుత పరిస్థితిపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏ పరిశ్రమ ఏర్పాటుకు భూములు తీసుకున్నదీ, ప్రస్తుతం అందులో ఉన్న పరిశ్రమ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలకు మంజురు చేసిన భూమి వినియోగంలో లేకపోతే ఆ భూముల వివరాలు ఇవ్వాలన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి కావాలని దరఖాస్తు చేసినా, భూములు కేటాయించని స్థితిలో ఉన్న దరఖాస్తుల వివరాలు తెలపాలన్నారు. ఇండిస్టీస్‌ ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ ఉమామహేశ్వరరావు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు రమణారావు మాట్లాడుతూ జిల్లాలో 23 భారీ పరిశ్రమలు రూ.5885.69 కోట్ల పెట్టుబడితో స్థాపించి 12,769 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. మరొక భారీ, మధ్యతరహా పరిశ్రమ నిర్మాణ దశలో ఉందని వివరించారు. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ పూర్తయితే 200 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 4,597 ఎంఎస్‌ఎంఐలు రూ.412.00 కోట్ల పెట్టుబడితో స్థాపించినట్లు తెలిపారు. వీటి ద్వారా 16,515 మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఈ ఏడాది మే చివరి వరకు 369 ఎంఎస్‌ఎంఐలు రూ.10.10 కోట్ల పెట్టుబడితో స్థాపించి 1401 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. సులభతర వాణిజ్య పరిశ్రమలకు అవసరమైన అన్నిరకాల అనుమతులు ఆన్‌లైన్‌ ద్వారా 21 రోజుల్లో మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఐడిపిని 2023-27 ప్రభుత్వం ప్రకటించిందని దీని ప్రకారం జనరల్‌, బిసి అభ్యర్థులకు 15 శాతం పెట్టుబడి రాయితీ రూ.20 లక్షలకు మించకుండా, మహిళలకు రూ.30 లక్షలకు మించకుండా ఇస్తున్నట్లు తెలిపారు. వంద శాతం ఎస్‌జిఎస్‌టి ఐదేళ్ల వరకు మూడు శాతం వడ్డీ రాయితీ రూ.25 లక్షలు మించకుండా ఇస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల వరకు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, సిటిఒ రాణిమోహన్‌, ఎల్‌డిఎం సూర్యకిరణ్‌, డ్వామా మేనేజర్‌ మురళీ, మైనింగ్‌ ఎడి సత్యనారాయణ, ఎపిఎంఐపి పీడీ శ్రీనివాస్‌, ఎపిఇపిడిఎల్‌ ఇఇ ఎల్సియస్‌ పాత్రుడు, చేనేత జౌళిశాఖ ఎడి సాయిప్రసాద్‌, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాదరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️