భార్యే కడతేర్చింది..!

నగరంలోని గూనపాలెంలో
  • వివాహేతర సంబంధమే కారణం
  • సురేష్‌ హత్య కేసు కొలిక్కిమూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

నగరంలోని గూనపాలెంలో పారిశుధ్య కార్మికుడు సురేష్‌ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. అక్రమ సంబంధానికి అడ్డం కాకూడదని ప్రియుడితో భర్తను అంతమొందించింది. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 17న గూనపాలెంలో సురేష్‌ తన ఇంట్లో మేడపై నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. మృతుని భార్య తిరుమల వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండడం, ఆమె నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో ఆమెపై అనుమానాలు బలపడ్డాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సురేష్‌ హత్యకు అతడి భార్య తిరుమలే సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు తన ప్రియుడిని తిరుమల వాడుకున్నారు. సురేష్‌ను అంతమొందిస్తే తమ వివాహేతర సంబంధానికి అడ్డు ఉండదని భావించారు. పధకం ప్రకారం ఈనెల 16న రాత్రి సురేష్‌ తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో నిద్ర మత్తులోకి జారుకున్నాడు. అర్ధరాత్రి 12 తర్వాత గూనపాలెం ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రియుడికి తిరుమల సమాచారం అందజేసింది. మరో మిత్రుని సహకారంతో తిరుమల ప్రియుడు, ఆమె ఇంటికే వెళ్లి నిద్రిస్తున్న సురేష్‌ గొంతును కత్తితో కోసేశారు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు ఇద్దరూ పరారయ్యారు.సురేష్‌ భార్య తిరుమల గతంలో నగరంలోని ఒక హోటల్‌లో పనిచేసిన సమయంలో అక్కడ పనిచేసే ఒడిశాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది వివాహేతర సంబంధానికి దారితీసింది. సురేష్‌ తమ సంబంధానికి అడ్డుగా మారడంతో తిరుమల అతడిని అంతమొందించాలని పధక రచన చేసింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా, అతడు ఆమదాలవలస రోడ్డులో ఓ దాబాలో పనిచేసే తన మిత్రుడి సహకారాన్ని తీసుకున్నాడు. తిరువుల ప్రియుడు, అతని మిత్రుడు కలిసి నిద్రిస్తున్న సురేష్‌ను తమ వెంట తెచ్చుకున్న కత్తితో హత్య చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️