1219వ రోజుకు ‘ఉక్కు’ దీక్షలు

'ఉక్కు' దీక్షలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలి వద్ద ఉక్కు పరిరక్షణ పోరాటసమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు శుక్రవారం 1219వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఉక్కు ట్రాఫిక్‌, ఆర్‌ఎండి, కన్స్ట్రక్షన్‌ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు వరసాల శ్రీనివాసరావు, డి ఆదినారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, మొదటి క్యాబినెట్‌ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ప్రధాని మోడీతో మాట్లాడాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడిసరుకు కొనుగోలుకు వీలులేకుండా కేంద్రం విధించిన ఆంక్షలు సడలించేందుకు చర్యలు చేపట్టాలని, పూర్తిస్థాయి సామర్థ్యం ఉన్నా, అరకొర ఉత్పత్తితో దాదాపు రూ.నాలుగు వేలకోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థలా మునుపటిలా కొనసాగించడమో, లేకుంటే సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు.స్టీల్‌ప్లాంట్‌ నిలదొక్కుకునేందుకు అవసరమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంతోపాటు, ప్లాంట్‌ భూములను ప్లాంట్‌కే బదలాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమని, కార్పొరేట్లకు రూ.12లక్షల కోట్ల రుణమాఫీ చేసిన కేంద్రం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పట్ల అనైతికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మెగా డిఎస్‌సి ప్రకటన మాదిరిగానే, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోఖాళీగా ఉన్న ఏడువేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, హరినాథ్‌, పివి. రమణ, ఎస్‌ శ్రీనివాసరావు, కె. సంతోష్‌కుమార్‌, దాసుబాబు, దానయ్య, నాయుడు, విజయానందరావు, శేఖర్‌, సువర్ణ రాజు, జి ప్రకాష్‌, వెంకటమ్మ పాల్గొన్నారు

దీక్షల్లో పాల్గొన్న కార్మికులు

➡️