కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు : ఎస్‌పి

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న సీతారాముల వారి కల్యాణానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ అన్నారు. మంగళవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సీతారాముల కల్యాణానికి పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ నియంత్రించాలన్నారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయం, కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై స్థానిక పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా భద్రత పర్యవేక్షించేలా పోలీస్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పి వెంకటరాముడు, కడప డిఎస్‌పి ఎం.డి.షరీఫ్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ జి.రాజు, ఒంటిమిట్ట సిఐ పురుషోత్తం రాజు, ఎస్‌.ఐ మధుసూదన్‌ రావు పాల్గొన్నారు.

➡️