లెక్కింపు కేంద్రంలో పటిష్ట భద్రత

May 24,2024 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌:  అరకు పార్లమెంటరీ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సాధారణ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఉద్యాన కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద నాలుగు నియోజకవర్గాల పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుతో పాటు బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లను, వసతుల కల్పనకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల లెక్కింపు ప్రక్రియ పూర్తికి అవసరమైన ఐరన్‌ మెస్‌ బారికేడింగ్‌ ఏర్పాటును చూశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ఏజెంట్లు వచ్చే మార్గం, ఎన్నికల సిబ్బంది వచ్చి వెళ్లే మార్గాలను సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌, లెక్కింపు టేబుళ్ల ఏర్పాట్లు, గాలి, వెలుతురు వసతి తదితర అంశాలపై నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారికేడింగ్‌ పటిష్టంగా ఉండేలా ప్రమాణాలను పాటించాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీస్‌ పహారాను చూశారు. అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ సహాయ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం శాసన సభ నియోజక వర్గ రిటర్నింగ్‌ అధికారులు శుభం బన్సల్‌, సి.విష్ణు చరణ్‌, వివి రమణ, కె.హేమ లత, డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, కంట్రోల్‌ రూమ్‌ ఎస్‌డిసి ఆర్‌.సూర్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️