ఎండ మంట

Apr 7,2024 21:15

ప్రజాశక్తి- రేగిడి : గత వారం రోజులుగా ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు బయట తిరిగేందుకే భయపడుతన్నారు. అలాంటి పరిస్థితిని ఎదురించి ఉపాధి కోసం కూలీలు మండే ఎండలో పనిచేస్తున్నా వారికి కనీస నీడ సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఎండలో మండిపోతూ పనులు చేస్తున్నారు. మరోపక్క ఇంత ఎండలో కష్టపడి పనిచేసినప్పటికీ గత నెల రోజులుగా కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంతో కడుపు మండి అల్లాడిపోతున్నారు. ఒక పక్క ఎండ మంట మరోపక్క కడుపు మంటతో కూలీలు అవస్థలు పడుతున్నారు. మండలంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో వేతనదారులు ఎటువంటి సౌకర్యాలూ లేక మండుటెండల్లోనే పనులు చేస్తున్నారు. కనీసం పనులు వద్ద నీడ, తాగునీరు, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలకు ప్రథమ చికిత్స కిట్లు లేక పోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. పనుల వద్ద కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఎండలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఫీల్డ్‌ అసిస్టెంట్లు మాత్రమే స్వచ్ఛందంగా కమ్మ షెడ్డు ఏర్పాటు చేసి వేతనదారులకు కొంతమేరకు నీడను కల్పిస్తున్నారు.జిల్లాలో 2018 సంవత్సరానికి మాత్రమే ఉపాధి కూలీల పనులు వద్ద నీడ కోసం పరదాలు అందజేశారు. ఆ పరదాలు కొన్ని సంవత్సరాలు తరువాత చిరిగిపోయి పాడైపోయాయి. ఆ తరువాత పనుల వద్ద నీడ కోసం ఎటువంటి పరదాలూ పంపిణీ చేయలేదు. కానీ 2021- 22 ఏడాదికి పరదాలు అందినట్లు ఉఎపిడిలు చెప్పడం కొసమెరుపు.. మండలంలో 39 గ్రామపంచాయతీలో 16,715 జాబ్‌ కార్డులున్నాయి. ఇందులో 2వేల మంది ఇళ్ల నిర్మాణ వేతనదారులు జాబ్‌కార్డులు పోగా, మరో 2వేలు కార్డులను వంద రోజులు పని పూర్తి చేసిన సందర్భంగా తొలగించారు. ప్రస్తుతం 12,060 జాబ్‌ కార్డులతో పనులు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.25.95 కోట్లు పనులకు ఆమోదం లభించింది. ఇప్పటికే పనులు ప్రారంభించారు. వీటికి ఫిబ్రవరి 29 నాటికి బిల్లులు వేతనదారులకు చెల్లించినట్లు చెబుతున్నప్పటికీ ఏప్రిల్‌ 7 వరకు 38 రోజులకు గాను 15 లక్షల మంది వేతనదారులకు పైసా కూడా ఖాతాలో జమ చేయలేదు. దీంతో వేతనదారులు నగదు ఖాతాలో జమ కాక నిత్యవసర సరుకులు కొనుగోలు చేయలేక ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఉపాధి సిబ్బంది పేమెంట్‌ రికార్డు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి వేతనదారులకు కూలి డబ్బులు రాలేదని చెబుతున్నారు.కూలి డబ్బులు రాక ఇబ్బందులుఉపాధి హామీ పథకంలో పనులు చేసినప్పటికీ 37 రోజుల నుంచి కూలి డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ కూలి డబ్బులు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పిల్లాపాపలతో కుటుంబాన్ని ఎలా నెట్టుకు రాగలం. ప్రభుత్వాలు తక్షణమే ఉపాధి కూలీ డబ్బులు ఖాతాలో జమ చేయాలి.ఏ. సత్యం, సంకిలి.పనుల వద్ద సౌకర్యాలు లేవుగ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులు వద్ద నీడ లేక ఎండలో పనులు చేస్తున్నాం. పనులు వద్ద తాగునీరు, నీడ కోసం పరదాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రథమ చికిత్స కిట్లు కూడా లేని పరిస్థితి. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.బొత్స సూర్యడమ్మ, కూలీపని వేళలు మార్చాంగ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులకు ఎండలు తీవ్రత కారణంగా సమయాలు మార్చాం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల వరకు చేయాలని ఆదేశించాం. పనులు వద్ద సౌకర్యాలు లేకపోవడం వాస్తవం. ప్రత్యామ్నాయంగా ఎండలు తీవ్రత కారణంగా కమ్మ షెడ్లు ఏర్పాటు చేయమని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఆదేశించాం.శ్రీనివాసరావు.. ఏపీడి. రాజాం క్లస్టర్‌.తాటాకు టెంట్లే దిక్కువేపాడ: మండలంలో పలు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులు వద్ద ఎటువంటి సౌకర్యాలూ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పనిచేసే చోట నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలి, తాగునీటి సౌకర్యం కల్పించాలి, మెడికల్‌ కిట్లు కూడా సమకూర్చి ఉంచాలి కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని చోట్ల చిరిగిపోయిన పరదాలను వేస్తున్నారని వాటి వల్ల ఉపయోగం లేదని మరికొన్ని చోట్ల అసలు చిరిగిన టెంట్లు కూడా లేవని వేతనదారులు చెబుతున్నారు.తాటాకులతో తాత్కాలిక టెంట్లుపరదాలు లేని చోట ప్రత్యేక శద్ద్రతో తాటాకుల టెంట్లు వేయిస్తున్నాం. మట్టికుండలో తాగునీరు ఏర్పాటు చేస్తునాం. ప్రథమ చికిత్స కోసం కిట్లును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం టెంట్లు ఇచ్చి చాలా కాలమైన విషయం తెలిసిందే. చాలా గ్రామాల్లో పరదాలు సగానికిపైగా చిరిగిపోయాయి. దీంతో నా సొంత నిధులతో ఉపాధి హామీ వేతనదారులు పనిచేసే చోట తాటాకులతో నీడ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాను. ఆదిలక్ష్మి ఎపిఒ, వేపాడ

➡️