ఓటేయలేని పరిస్థితుంటే చెప్పండి

Apr 3,2024 23:24

ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇబ్బంది పడే పరిస్థితులుంటే తమ దృష్టికి తేవాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌ కోరారు. స్థానిక ఆర్‌ఒ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 299 పోలింగ్‌ కేంద్రాలకుగాను 151 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, ఇప్పటికే 635 మందిని బైండోవర్‌ చేశామని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునే వారిపై కఠిన చర్యలుంటాయని, ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు అవసరమైన నంబర్లు, యాప్‌లు గ్రామ స్థాయి అధికారి వద్ద కూడా అందుబాటులో ఉంటాయని, అవసరమైతే వారిని సంప్రదించాలని సూచించారు. యాప్‌లు ఉపయోగించుకోలేని వారు నేరుగా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు వస్తున్నాయని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. లా అండ్‌ ఆర్డర్‌కు ఇబ్బందిలేని విధంగా రాజకీయ పార్టీలు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోని ప్రచారం చేసుకోవాలన్నారు.

➡️