పోతేపల్లిలో డ్రైనేజీ సమస్య పరిశీలించిన కలెక్టర్‌

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ (కృష్ణా) : పోతేపల్లెలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తామని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మంగళవారం బందరు మండలం పోతేపల్లి గ్రామం సందర్శించి డ్రైనేజీ సమస్యపై రైల్వే ట్రాక్‌ వద్ద ఆర్డీవో, డ్రైనేజీ, రైల్వే, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలన జరిపారు. రైల్వే శాఖ బందరు గుడివాడ డబుల్‌ లైన్‌ ట్రాక్‌ నిర్మాణంతో గతంలో పాత ట్రాక్‌ ప్రక్కగా రైల్వే భూమి గుండా వెళ్లే డ్రైన్‌ పూడిపోవడంతో వర్షాలకు డ్రైన్‌ ఎదురు తన్ని పొలాలు మునగటం, ఊళ్లో రోడ్లు మునగడం జరుగుతోందని మాజీ సర్పంచ్‌ కాటం మధు, గ్రామస్తులు కలెక్టరుకు తెలిపారు. రైల్వే ట్రాక్‌ రెండువైపులా డ్రైన్‌ ని పరిశీలించిన కలెక్టర్‌ ఆర్డీవో, స్థానిక రైల్వే అధికారితో చర్చించారు. డౌన్‌ స్ట్రీమ్‌ రైల్వే ట్రాక్‌ ప్రక్కన డ్రైనేజీ తవ్వితే ట్రాక్‌ కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారి తెలుపగా, రైల్వే ట్రాక్ల భద్రత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, వారం రోజుల్లో వారు కూడా పరిశీలించే విధంగా చూడాలని, డ్రైనేజీ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కలెక్టర్‌ నిర్ణయించారు.బందర్‌ ఆర్డీవో ఎం వాణి, డ్రైనేజీ శాఖ డీఈ బి. కిరణ్‌, రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ (పర్మినెంట్‌ వే) ఆర్‌. వెంకటేశ్వర్లు, తాసిల్దారు వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️