రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కార్మికవర్గ కర్తవ్యం

Apr 13,2024 21:36

ప్రజాశక్తి – సీతంపేట : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని రాజ్యాంగంలో కార్మికులకు పొందుపర్చిన హక్కులను నాశనం చేస్తున్న వారికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా కార్మిక వర్గం తీర్పునివ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దావాల రమణారావు, వై.మన్మధరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మండల కార్యదర్శి ఎం.కాంతారావు అధ్యక్షతన జరిగిన కార్మిక వర్గం, సార్వత్రిక ఎన్నికలు, కర్తవ్యం అనే అంశంపై జరిగిన సదస్సులో వారు మాట్లాడారు. కేంద్రంలో మోడీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, కార్మిక వర్గం, గిరిజన హక్కులు హరించబడతాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. భారత రాజ్యాంగం ధ్వంసం చేసే చర్యలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడతాయని, బిజెపిని, దాని తొత్తు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మక్కువ: రానున్న ఎన్నికల్లో బిజెపి, దాని తొత్తు పార్టీలను ఓడించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు పిలుపునిచ్చారు. శనివారం మక్కువలో సిఐటియు సమావేశం కృష్ణ, దానమ్మ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలమయ్యాని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటు వేదికగానే కార్మిక చట్టాలపై దాడి చేసిందని, దీనికి రాష్ట్రంలోని పాలకులు వంత పాడారని ప్రతిపక్ష పార్టీలు కూడా బిజెపి విధానాలకు అడ్డుచెప్పని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. అందుకే రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలపై ఏం చేస్తారో తెలియజేయాలని సిఐటియు అన్ని పార్టీలను కోరుతుందన్నారు. అనంతరం అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్‌ అంబేద్కర్‌ ఇచ్చిన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడి పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జ్యోతి, గౌరీశ్వరి, ప్రభాకర్‌, రామారావు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. సాలూరురూరల్‌ :కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఏకం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు పిలుపునిచ్చారు. మండలంలోని మామిడిపల్లిలో శశికళ ఆధ్వర్యంలో సిఐటియు విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, నాయకులు రాజేశ్వరి, నారాయణమ్మ, పుష్ప, జానకి, కుమారి పాల్గొన్నారు. వీరఘట్టం : భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఎం మండల నాయకులు సింహాచలం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ఈనెల 14వ తేదీన అంబేద్కర్‌ జయంతి కార్యక్రమాలు పట్నాలోనూ, అన్ని గ్రామాల్లోనూ నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాం గాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించడమే ఎస్‌టి, ఎస్‌సి, బిసి, మహిళా, మైనార్టీ, కార్మిక, కర్షకులు, అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల నాయకురాలు సిహెచ్‌ చిన్నమ్ముడు తదితరులు, పాల్గొన్నారు.

➡️