అధికారుల అలసత్వం.. జనాలకు జరిమానా

May 24,2024 22:55

ప్రజాశక్తి – పెదకూరపాడు : పెదకూరపాడు నియోజకవర్గంలో భూములను 2016లో ఆన్లైన్లో చేశారు. అప్పటి అధికారులు హడావుడి, అలసత్వం వల్ల ఇప్పుడు ప్రజలు ఏళ్ల తరబడి కార్యా లయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఒకే సర్వే నంబర్‌లో దేవాదాయ భూములు, చెరువు పోరంబోకు, పట్టా భూములుంటే వాటన్నింటినీ దేవాదాయ భూములుగా, చెరువు పోరంబోకు భూములుగా నమోదు చేశారు. అప్పటినుండి ప్రజలకు భూ సమస్యలు మొదలయ్యాయి. క్రోసూరులో 594-ఎ2 సర్వే నంబర్లు 484 ఎకరాల్లో కొండ, చెరువు, గ్రామము ఉంటుంది. అందులో కొండ ప్రాంతం 23 ఎకరాల్లో ఇళ్లున్నాయి. ఆన్లైన్‌ నమోదు చేసినప్పుడు మొత్తాన్ని చెరువు పోరంబోకుగా చూపించడంతో వెయ్యి కుటుంబాలు పైన ఉన్న స్థానికులు అవస్థ పడుతున్నారు. ఇల్లు అమ్మాలన్న, కొనాలన్నా లావాదేవీలు జరిగే పరిస్థితి లేదు. విద్యా అవసరాలకు, ఇతర అవసరాలకు బ్యాంకులో తాకట్టుపెట్టి అప్పు తెచ్చు కోవాలన్న వీలు కావడంలేదు. చెరువు పోరంబోకుగా 22ఎలో నమోదైంది. ఆ ప్రాంతంలోని ఇల్లు అమ్ముకో వాలంటే పక్క సర్వే నంబరు వేసి రిజిస్ట్రేషన్‌ చేయించు కునే పరిస్థితి నెలకొంది. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. సవరణ దస్తావేజు ద్వారా సర్వే నంబరు మార్చుకుంటే రుసుము చెల్లించవలసి ఉంటుంది. 2017 నుండి ఈ సమస్య పరిష్కారం కోసం ఆ ప్రాంతవాసులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2022లో అఖిలపక్ష స్థాయిలో కమిటీగా ఏర్పడి ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అప్పటినుండి 594ఎ2ను 594ఎ2ఎగా మార్చాలని నిర్ణయించారు. సబ్‌ డివిజన్‌ నంబరు ఇచ్చినా రాష్ట్రస్థాయిలో సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అనుమతులు మంజూరు కాలేదు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఇంకా పరిష్కారం కాలేదని కొండ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా
ఇంటిని అమ్ముకోవాలంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. 2017 నుంచి పోరాటం చేస్తుంటే చెరువు పోరంబోకు, నివాస గృహాలకు ప్రత్యేక నంబర్లు ఇచ్చి సబ్‌ డివిజన్‌ మాత్రమే చేశారు. రాష్ట్రస్థాయిలో ఇంకా ఆమోద ముద్ర పడలేదన్నారు. అధికారులు చేసిన చిన్న పొరపాటుకు క్రోసూరు కొండ కింద ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలను చుట్టూ తిరుగుతున్న పెండింగ్‌ దశలోనే ఉంది. భూమి అమ్ముకునేవారు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అత్యవసరమైతే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
ఆదిరెడ్డి, స్థానికులు, టి.హనుమంతరావు, కెవిపిఎస్‌ నాయకులు.

➡️