వైసిపి పాలనలో అభివద్ధి శూన్యం :’ముక్కా’

ప్రజాశక్తి-రైల్వేకోడూరు వైసిపి పాలనలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో అభివద్ధి శూన్యమని టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి పేర్కొన్నారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని సహించలేక ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని, కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌ను గెలిపించినట్లయితే అభివద్ధి ఏంటో చూపిస్తానని హామీనిచ్చారు. అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ కూటమి పార్టీలలోని కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌ను గెలిపించేందుకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు. సోమవారం చిట్వేలి మండలం రాజుగుంట నుంచి ఉమ్మడి అభ్యర్థి శ్రీధర్‌తో కలిసి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్టా గుండయ్య, గడికోట సుబ్బరాయుడు, గునిపాటి చెన్నరాయుడు, చంద్రమోహన్‌, జనసేన నాయకులు జోగినేని మణి, వెంకటేష్‌, సర్పంచ్‌ సంయుక్త, జ్యోతి, సభాపతి పాల్గొన్నారు.

➡️