పిరిడి నుంచి ముచ్చటగా ముగ్గురు

Apr 13,2024 21:30

 ప్రజాశక్తి-బొబ్బిలి : జిల్లాలో బొబ్బిలి మండలంలో ఉన్న పిరిడి గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఈ గ్రామం నుంచి ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. గ్రామానికి చెందిన కొల్లి వెంకటకూర్మినాయుడు నిస్వార్థ రాజకీయాలకు చిరునామాగా మారి, ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. 1952లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. చింతాడ సమితి అధ్యక్షులుగా పదేళ్ళపాటు కొనసాగారు. 1978లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. నిస్వార్థంగా ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందారు. ఆయన చేస్తున్న ప్రజాసేవను తెలుసుకున్న అప్పటి గవర్నర్‌ సింగ్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. 1983 ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతునిచ్చారు. ఆ ఎన్నికల్లో శంబంగి గెలుపొందారు. అదే గ్రామానికి చెందిన పెద్దింటి కుటుంబం నుంచి తండ్రి, కొడుకు ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. 1955లో బలిజిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్‌ నుంచి పెద్దింటి రామస్వామినాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కుమారుడు పెద్దింటి జగన్మోహన రావు 1989లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్మోహనరావు ఎంబిబిఎస్‌ పూర్తిచేసి, బొబ్బిలిలో ఆస్పత్రి ఏర్పాటు చేసి, వైద్యసేవలందించారు. అటవీశాఖా మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

➡️