అంబేద్కరా..ఆలకించు..!

Jan 19,2024 22:05
అంబేద్కరా..ఆలకించు..!

జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీల వినతులుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం భారత రాజ్యాంగాన్ని కాకుండా, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సిఎం జగన్‌కు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని అంగన్‌వాడీలు విమర్శించారు. గత 39 రోజులుగా మహిళలు రోడ్డుపైకొచ్చి పండగలను సైతం పక్కన పెట్టి సమ్మె చేస్తుంటే పట్టించుకోని జగన్‌ తీరును వివరిస్తూ ‘అంబేద్కరా.. మా మొర విను’ అంటూ జిల్లావ్యాప్తంగా వినతిపత్రాలను అందజేశారు. – శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ నాయకులు రేవతి, శోభ మాట్లాడుతూ అంగన్‌వాడీలు రాజ్యాంగబద్దంగా సమ్మె చేస్తుంటే సిఎం జగన్‌ ఎస్మాస్త్రాన్ని ప్రయోగించి ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. -గూడూరు టౌన్‌లో టవర్‌క్లాక్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఇంద్రావతి, సిఐటియు నాయకులు బివి రమణయ్య, సురేష్‌ నేతృత్వంలో నిరసన తెలిపారు. – రేణిగుంటలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఇచ్చి పాదాభివందనం చేశారు. యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు ధనమ్మ, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ లక్ష మంది మహిళలురోడ్డున పడి 39 రోజులుగా సమ్మె చేస్తుంటే జగనన్నకు కనబడలేదా? అని ప్రశ్నించారు. – కోటలో కారు స్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ర్యాలీగా వచ్చి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పద్మలీలమ్మ మాట్లాడుతూ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను సాధిద్దామని అన్నారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు. – నాయుడుపేటలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ప్రాజెక్టు నాయకురాలు ఎన్‌.శ్యామలమ్మ, సిఐటియు నాయకులు శివకవి ముకుంద మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అని అన్నారు. అయితే జగన్‌ మహిళా సాధికారత అంటూనే అంగన్‌వాడీలను రోడ్డున పడేశారన్నారు. – పుత్తూరు టౌన్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలను పది మందితో ప్రారంభించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. టెర్మినేషన్‌ నోటీసులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమను తొలగించాలని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తామని హెచ్చరించారు. మునికుమారి, విజరుకుమారి, మోహన్‌ లక్ష్మి పాల్గొన్నారు

➡️