అలకలు…అసంతృప్తులు

అలకలు...అసంతృప్తులు

అలకలు…అసంతృప్తులుప్రజాశక్తి-తిరుపతి సిటి జిల్లాలో ఎన్నికల సమరం వేడెక్కుతోంది.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికలు, ఆశావహుల అసంతృప్తులు, అలకలు ఎక్కువయ్యాయి. టిక్కెట్‌ దక్కని వారికి పార్టీ అధినేతలు పిలుపు, బుజ్జగింపులు, హామీలతో తృప్తిపరిచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. హామీలు, బుజ్జగింపులు నచ్చనివారు ఇండిపెండెంట్‌గా అయినా పోటీకి సిద్దమంటూ మీడియా ముందే ప్రకటనలు చేస్తుండడం, లోకల్‌, నాన్‌లోకల్‌ ప్రస్తావన తెరపైకి తెస్తూ స్థానిక నాయకులు ముక్తకంఠంతో ఐక్యతారాగం తెలుపుతుండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్‌ స్థానంతో పాటు చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడురు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఎంఎల్‌ఏలుగా ఉన్నారు. సత్యవేడు ఎంఎల్‌ఏ ఆదిమూలం, గూడూరు ఎంఎల్‌ఏ వరప్రసాద్‌కు సీట్లు నిరాకరించడంతో వారిద్దరూ పార్టీలు మారారు. ఆదిమూలం టిడిపిలో చేరారు, టిడిపి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. అక్కడ మొదటి నుంచి టిక్కెట్‌ ఆశీస్తున్న జేడి రాజశేఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను బరిలో ఉంటానని, అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మీడియా ముందే ప్రకటించారు. గూడురు ఎంఎల్‌ఏ వరప్రసాద్‌ వైసిపిని కాదని, జనసేన పంచనచేరారు. మరో పక్క జనసేన, టిడిపి, బిజెపి పొత్తుల్లో బాగంగా తిరుపతి పార్లమెంట్‌ సీటు బిజెపికి అప్పగించారు. తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తుల్లో బాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో తిరుపతిలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ పోటీలో ఉంటారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరిణి శ్రీనివాసులు (జంగాలపల్లి)కి అధికార వైసిపి టిక్కెట్‌ నిరాకరించడంతో అతను జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. వెనువెంటనే ఆయన్ని తిరుపతి అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో తిరుపతిలో అలకలు అసంతృప్తిలు ఎక్కువయ్యాయి. మొదటి నుంచి టిడిపి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంఎల్‌ఏ సుగుణమ్మకు ఎన్నికల పొత్తుల్లో బాగంగా మొండి చెయ్యి దక్కింది. టిడిపి టిక్కెట్‌ ఆశీంచిన జెబి శ్రీనివాసులు, వూకా విజరుకుమార్‌ సైతం మొండిచేయ్యి దిక్కుయింది. వూకా విజయకుమార్‌ మరో అడుగు ముందుకేసి జనసేన పార్టీలో చేరి, తిరుపతి అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేశారని గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికి చెక్‌ పెడుతూ స్థానికేతరుడైన ఆరిణి శ్రీనివాసులను తిరుపతి జనసేన అభ్యర్ధిగా ప్రకటించడంతో అటు టిడిపి నాయకులు, ఇటు జనసేనకు చెందిన డాక్టరు పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌, రాజారెడ్డి, బిజెపి స్థానిక నాయకులు బహిరంగంగానే తమన అసంతృప్తిని వెలగక్కుతూ, మూడు పార్టీలకు చెందిన నాయకులు ఓ హోటల్‌ సమావేశం నిర్వహించి స్థానికేతురుడిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. వెనువెంటనే ఆరణి శ్రీనివాసులు గోబ్యాక్‌ అంటూ నగరంలో ప్లెక్సీలు ప్రత్యక్షం అయ్యాయి. పలు ప్రాంతాల్లో యువతతో కలిసి నిరసనలకు సిద్దం అయ్యారు. రాత్రికి రాత్రే సీను మారిపోయింది. అటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డాక్టరు పసుపులేటి హరిప్రసాద్‌కు, కిరణ్‌రాయల్‌కు ఫోన్‌ ద్వారా పార్టీ ఆదేశాన్ని దిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో మరుసటి రోజే పార్టీ అభ్యర్దితో కలిసి ప్రచారానికి సిద్దమయ్యారు. మరో పక్క టిడిపికి చెందిన మాజీ ఎంఎల్‌ఏకి టిడిపి అధినేత స్వయంగా ఫోన్‌ చేసి బుజ్జగించి, ప్రోటాకాల్‌తో కూడిన పదవి ఇచ్చేందుకు హామీ ఇవ్వడంతో ఆమె చల్లబడింది. మరో వారం రోజుల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్ధుల లిస్టు పూర్తికానున్నాయి. ఎవ్వరు బరిలో ఉంటారు, ఎవ్వరు గెలుపుగుర్రాలు ఎక్కుతారు. ఎవ్వరు ఏ పార్టీలో ఉంటారు రాబోవు రోజుల్లో బహిర్గతం అవ్వతాయి. అప్పటి వరకు వేచి చూడడమే ఓటర్ల పని.

➡️