‘ఆరణి’ చిచ్చుకూటమి అభ్యర్థికి సహకరించని వైనంపరస్పర విమర్శలు, శాపనార్థాలు

'ఆరణి' చిచ్చుకూటమి అభ్యర్థికి సహకరించని వైనంపరస్పర విమర్శలు, శాపనార్థాలు

‘ఆరణి’ చిచ్చుకూటమి అభ్యర్థికి సహకరించని వైనంపరస్పర విమర్శలు, శాపనార్థాలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపి – జనసేన – బిజెపి కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును ప్రకటించినప్పటి నుంచి చిచ్చు ఆరలేదు. పరస్పర దూషణలు, శాపనార్ధాలతో అటు టిడిపి, ఇటు జనసేన వీధికెక్కుతోంది. ‘నాన్‌ లోకల్‌’ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థి తమకొద్దంటూ తొలిరోజే ‘ఆరణి గో బ్యాక్‌’ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. టిడిపి మాజీ ఎంఎల్‌ఎ మన్నూరు సుగుణమ్మ పట్టువీడకుండా ఆరణి శ్రీనివాసులును శాపనార్ధలు పెడుతూనే ఉన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, టిడిపి, జనసేన శ్రేణులను ఎంత బుజ్జగించినా ఏకతాటిపైకి వచ్చిన పరిస్థితి లేదు. మంగళవారం సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ తనకు తీరని అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో గెలవరని శాపనార్ధాలు పెట్టారు. తాజాగా జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌రాయల్‌ తిరుపతిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆరణి శ్రీనివాసులుపై తనకున్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌ చెబితే కుక్కను పెట్టినా గెలిపిస్తాం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ఇన్‌ఛార్జిగా ఉన్న తాను ఇన్ని రోజులకు గుర్తుకొచ్చానా? అని ఎద్దేవా చేశారు. తనకు తెలియకుండానే బూత్‌లెవల్లో జనసేన క్యాడర్‌ను కాకుండా వైసిపి క్యాడర్‌ను నియమించుకుంటున్నారన్నారు. కిరణ్‌రాయల్‌కు రెండు కోట్లు ఇచ్చాను, అంతా సర్దుకుంటారని ఉద్దేశపూరకంగా తనపై బురద జల్లుతున్నారన్నారు. కిరణ్‌రాయల్‌ విలువ రెండు కోట్లేనా, ఏ పదో, పదహైదో చెప్పుకోవచ్చు కదా అని కోప్పడ్డారు. భవిష్యత్‌లో ఆరణి శ్రీనివాసులు జన సేన క్యాడర్‌ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆరణి శ్రీనివాసులు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా బుధవారం ఉదయం కపిలతీర్థం నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిత్ర పార్టీ అయిన టిడిపి నుంచి, సొంత పార్టీ అయిన జనసేన నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతుండగా ప్రచారం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఆరణి శ్రీనివాసులు మాత్రం బిజెపి నాయకులను, వైసిపిలో ఉన్నప్పటి అనుచరగణాన్ని కలిసి తనకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టిడిపి టిక్కెట్‌ ఆశించిన డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం ఒక్కరు మాత్రమే ఆరణి శ్రీనివాస్‌ పక్షాన చేరారు. టిక్కెట్‌ ఆశించిన మిగిలిన సుగుణమ్మ, వూకా విజరుకుమార్‌, జెబి శ్రీనివాస్‌, నరసింహయాదవ్‌ మాత్రం సహాయ నిరాకరణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి నియోజకవర్గంలో జనసేన కూటమి అభ్యర్థికి ‘సొంత గూట్లో’నే చిచ్చు ఆరకుండా మండుతూనే ఉంది. రెండు రోజులుగా ఆరణి శ్రీనివాసులు హోటళ్లలో ప్రెస్‌మీట్లు పెడుతున్నా టిడిపి నాయకులు ఎవరూ హాజరుకాకపోవడం గమనార్హం. జనసేనకు సంబంధించి పసుపులేటి హరిప్రసాద్‌ మాత్రమే ఉంటున్నారు. నేటినుంచి జనసేన కూటమి ఎన్నికల ప్రచారం జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో హరిప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు తిరుపతిలో అభ్యర్థి వివాదాన్ని పరిష్కరిస్తారని, టిడిపి నాయకులందరూ సహకరిస్తారని హామీ ఇచ్చారన్నారు. ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ బుధవారం ఉదయం కపిలేశ్వరస్వామి ఆశిస్సులతో జీవకోన లింగేశ్వర స్వామి ఆలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించిఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. నాయకులు రాజారెడ్డి, రాజేష్‌రాయల్‌, కీర్తన, వనజ పాల్గొన్నారు.

➡️