ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేయాలి : టిటిడి

ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేయాలి : టిటిడి

ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేయాలి : టిటిడిప్రజాశక్తి -తిరుపతి సిటీ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో ఏవి.ధర్మారెడ్డి ఉద్యోగులతో క్రీడాప్రతిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మన్‌, ఈవో కలిసి క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మన్‌ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడాపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు. ఉద్యోగులకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్రతిభ కనబరిచి క్రీడల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ స్నేహలత మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతేడాది 829 మంది పురుషులు, 422 మంది మహిళలు పాల్గొన్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800, మూడో స్థానంలో నిలిచినవారికి రూ.1600 విలువగల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌, ఈవో వాలీబాల్‌ ఆడి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర, సీపీఆర్వో డా.టి.రవి, విజిఓ బాలిరెడ్డి పాల్గొన్నారు.

➡️