కమిషనర్‌ వచ్చినా కదలని ఫైళ్లు..!

Feb 28,2024 22:19
కమిషనర్‌ వచ్చినా కదలని ఫైళ్లు..!

శ్రీ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికారులు భయం.. భయం..శ్రీ పెండింగ్‌లో అభివద్ధి పనులుశ్రీ కార్పొరేషన్‌ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ప్రజలుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో అప్పటి కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న గిరిషాను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. అలాగే తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఏఆర్‌ఓగా పనిచేసిన చంద్రమౌళీశ్వర రెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.. దీంతో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ప్రభావం పడింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌గా అదితి సింగ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్రమత్తమయ్యారు. తిరుపతి కమిషనర్‌గా అదితి సింగ్‌ వచ్చినప్పటి నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలన సక్రమంగా సాగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. నూతన కమిషనర్‌ అదితి సింగ్‌ అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి లోటుపాట్లు తెలుసుకోవల్సి ఉందని… ఇటు రెవెన్యూ, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సంక్షేమ పథకాలు అమలు వంటి పలు విభాగాలతో సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించి పరిశీలించాల్సి ఉంది. అయితే కమిషనర్‌ ఇవేమీ చూడడం లేదని, అసలు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని, కేవలం ఎన్నికలకు సంబంధించిన విధులు మాత్రమే నిర్వహిస్తున్నారని నగరంలో ప్రచారం జరుగుతోంది. గత నెల 28వ తేదీన కమిషనర్‌ హరిత బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో అదిత సింగ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అన్ని డివిజన్లు పర్యటించి ఆ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటి పనులు కూడా నగరపాలక సంస్థలు జరగడం లేదని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. నగరంలో ప్రతిరోజు తడి, పొడి చెత్త సేకరించడానికి మినీ ఆటోలు, ట్రాక్టర్లు, కంటైనర్లు వినియోగిస్తారు. దానికి సంబంధించిన డీజిల్‌ బిల్లులు కూడా సకాలంలో కమిషనర్‌ చెల్లించడానికి అతి కష్టం మీద సంతకం చేసినట్టు సమాచారం. మిగిలిన ఇంజనీరింగ్‌ విభాగంలో పెండింగ్లో ఉన్న అభివద్ధి పనులు, రెవెన్యూ విభాగంలో ఉన్న పెండింగ్‌ ఫైలు టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఉన్న పెండింగ్‌ ఫైల్లను ఇంతవరకు కొత్త కమిషనర్‌ పరిశీలించకపోవడం వల్ల ఇటు రాజకీయనేతలు అటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కూడా రెండునెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్ట్‌ కార్మికులు అవస్థలు పడుతున్నారు.పేరుకుపోతున్న ఫైళ్లు…. నగరపాలక సంస్థలు ఆయా విభాగాలు చెందిన ఫైళ్లు బీరువాలో పేరుకుపోతున్నాయి. నూతనంగా కమిషనర్‌ బాధ్యతలు తీసుకున్న అదిత సింగ్‌ వాటిని క్లియర్‌ చేయడానికి సాహసించడం లేదని తెలుస్తోంది. నగరంలో కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు కొత్తగా ఆస్తి పన్ను విధించాలన్న రెవెన్యూ విభాగానికి ఫైళ్లు వెళ్లాలి అక్కడి నుంచి డిప్యూటీ కమిషనర్‌ తర్వాత కమిషనర్‌ లాగిన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ఫైళ్లు 50 డివిజన్లకు సంబంధించి పేరుకుపోయి ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ఆస్తి పన్నులు, పేరు మార్పులు, చేర్పులతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన ఫైలు పెండింగ్లోనే ఉండడంతో ప్రజలు ప్రతిరోజు మున్సిపల్‌ కార్పొరేషన్‌ తిరుగుతూనే ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా అనేక ఫైల్స్‌ పేరుకుపోయి ఉన్నాయి. నగరంలో కాంట్రాక్టర్లు చేసిన అభివద్ధి పనులకు సగం వరకు బిల్లులు రాకపోక మిగిలిన పనులు పూర్తి చేయడానికి కమిషనర్‌ నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అలాంటి పనులు కూడా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో వేసవికాలం మొదలుకాకముందే తాగునీటి సమస్య రాకుండా అత్యవసర ప్రాంతాల్లో నీటితసరఫరా చేసేందుకు కమిషనర్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంది, అలాంటి అంశాలు కూడా కమిషనర్‌ పరిశీలించలేదని తెలుస్తుంది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో నగరంలో కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు అనుమతులు కమిషనర్‌ లాగిన్‌ నుంచే రావాల్సి ఉంటుంది.. అయితే ఇలాంటి ఫైలు కూడా పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు వేసిన చోట టిడిఆర్‌ బాండ్లు ఇవ్వాల్సిన వారికి చాలా వరకు పెండింగ్లో ఉండడం వల్ల స్థలాలు కోల్పోయిన వారు ప్రతిరోజు కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.ఎన్నికల విధులు నిర్వహణ… తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌తో పాటు అడిషనల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్లు కొత్తవారు కావడం వల్ల అభివద్ధి పనులు కాకుండా కేవలం ఎన్నికల నిర్వహణ సంబంధించిన విధులు నిర్వహిస్తున్నట్లు నగరంలో ప్రచారం జరుగుతుంది. 50 డివిజన్లో సంబంధించిన కార్పొరేటర్లు తమ డివిజన్లో ప్రతి సోమవారం స్పందన గ్రీవెన్స్‌లో సమస్యలు తెలియజేస్తున్నా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో డివిజన్లో పనులు జరగవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌ అభివద్ధి పనులు సంబంధించి యుద్ధప్రాతిపదికంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️