చేయించినోళ్లు సేఫ్‌

Feb 17,2024 23:01
చేయించినోళ్లు సేఫ్‌

దొంగోట్ల లీలలు అధికారులే బలిప్రజాశక్తి- తిరుపతి సిటి: పాలకులు.. అధికార పక్షం అగడాలు అంతేలేదు. అక్రమాలు..దోపిడులు ఇతరాత్ర వాటి మాట దేవుడెరుగు..ఆఖరికి రాజ్యాంగాన్నే అపహాస్యం చేస్తున్న ఘటనలు కొకొల్లాలు. రాష్ట్రంలో అధికార పక్షం మరో అడుగు ముందుకేసి ఏకంగా దొంగోట్ల నమోదుకు దిగడం. అది బహిర్గతం కావడం, ఎన్నికల కమీషన్‌ సీరియస్‌ అవడంతో అధికారులను బలిపశువులను చేశారు. కానీ చేయించినన వారు మాత్రం సేఫ్‌ అవడం గమనార్హం. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే చందాగా కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు దూసుకెళ్లుతోంది. ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకోబడేలా రాజ్యాంగం ఏర్పడింది. ఎవ్వరైన ప్రజాసేవ కోసం రాజకీయాల్లో ప్రవేశించే రోజులు ఏనాడో పోయాయి. సంపదనే ధ్యేయంగా…అధికార దాహంతో పరితపించే రోజులు నడుస్తున్నాయి. ఎవ్వరైనా ప్రజాప్రతినిధులు తప్పచేస్తే, పాలకులు ప్రజాసంక్షేమాన్ని పక్కనపెడితే, అభివృద్ధి దిశగా ముందుకెళ్లకపోతే ప్రజలు తమ ఓటుతో ఎన్నికల సందర్భంగా వారికి తగిన గుణపాఠం చెప్పాలని మేధావులు రాజ్యాంగం ద్వారా ప్రజలకు వజ్రాయుధానికి కంటే బలమైన ఓటుహక్కును కల్పించారు. కానీ నేటి పాలకులు దాన్ని అపహాస్యం చేస్తూ అధికారంలో ఉన్న తమను ఎవ్వడేమి చేస్తాడు అనే ధీమాలో వెళ్లుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఏకంగా తమ గెలుపుకు అనుకూలంగా దొంగఓట్ల నమోదుకు దిగడం దారుణం. ఇలాంటి చర్యలు క్షమించరానివి. కానీ ఏమి చేద్దాం మనది ఘనత వహించిన ప్రజాస్వామ్యం కదా.. ప్రతి ఒకరికి ఏదైనా చేసే స్వేచ్చ ఉన్నట్టుంది. అది కూడా అధికార పక్షానికే. అందుకే బరితెగించి, బహిరంగానే రాజ్యాంగాన్ని నిర్వర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగానే చర్చించుకోవడం గమనార్హం.దొంగోట్ల పాపం ఎవ్వరి..? 2021లో జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నికల అక్రమాలు బహిర్గతం కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉపఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ది గెలుపుకోసం తిరుపతి కేంద్రంగా భారీస్థాయిలో దొంగ ఓట్లు నమోదు కావడం, దీన్నిపై ప్రతిపక్షాలు పోరాడటం, వామపక్ష పార్టీలు, మీడియా స్వయంగా దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించడంతో చర్యలు తప్పలేదు. అది కూడా రెండిన్నార సంవత్సరాలు వేచి చూసిన ఈసి ఎట్టికేలకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి ఎన్నికల ఆర్‌వోగా విధులు నిర్వహించిన అప్పటి కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీషాను భాద్యున్ని చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బాధ్యతులు నిర్వహిస్తున్న ఆయన్ని సస్పెండ్‌ చేసింది. తిలాపాపం తలాపిడికెడు.. కానీ ఒకర్ని భాద్యులు చేయడమేమిటని రాజకీయ పార్టీలు విమర్శించడంతో అప్పటి ఎన్నికల్లో ఏఆర్‌వో వ్యవహరించిన కార్పొరేషన్‌ డిప్యూటీ కమీషనర్‌ చంద్రమౌళిరెడ్డిని కూడా సస్పెండ్‌ చేసింది. దొంగఓట్ల కారకులపై చర్యలు తీసుకోవాలనే వాదన తీవ్రం కావడంతో రాజకీయ పార్టీల ఫిర్యాదులను పట్టించుకోలేదని, కొన్ని ఫిర్యాదులను తీసుకున్న వాటిని నిరూగార్చేలా చేశారని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగ ఓట్లు తంతు సాగిందని బావించి, ముగ్గురు సిఐలు శివప్రసాద్‌రెడ్డి, దేవేంద్ర కుమార్‌, శివప్రసాద్‌, ఎస్‌ఐ జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ ద్వారకానాధ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. మరో సిఐ అబ్బన్నను విఆర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ది గెలవాలనే దొంగ ఓట్లకు ఉపక్రమించింది. అందుకు బాధ్యులు ఎవ్వరు? దొంగఓట్లతో గెలుపొందిన ఎంపిని కనీసం ప్రశ్నించలేదు. దొంగ ఓట్లకు పురమాయించి, అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, బెదిరించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ పెద్దల పరిస్థితి ఏంటి..? దగ్గరుండి దొంగోట్లు వేయించిన అధికార పార్టీ నాయకులు, దౌర్జన్యానికి పాల్పడిన అనుయుల పై చర్యలు లేవి? ఇవేవి ఉండవు. ఈసి అయినా తమకు అనుకూలంగానే వ్యవహరించాలి అనేలా అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు పలువుర్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే కాదు. గతంలో పాలించిన పార్టీలది కూడా ఇదే తంతు. వామపక్ష పార్టీలు తప్ప బూర్జవ పార్టీలన్ని అక్రమాలు, అన్యాయాలు, దోపిడిలకే తొలి ప్రాదాన్యత ఇచ్చేలా వ్యవహరిస్తున్నాయి. గతంలో తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నికల్లో అప్పడి టిడిపి అభ్యర్ది గెలుపుకోసం సరిహద్దు రాష్ట్రమైన కర్నాటక నుంచి సైతం బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించిన విషయం అందరికి ఎరుకే. అప్పటి ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ అభ్యర్ధి స్వయంగా నాలుగు బస్సులకు సంబంధించిన దొంగ ఓటర్ల బస్సులకు అడ్డుగా పడుకుని, మీడియా సాక్షిగా పోలీసులకు అప్పగిస్తే కనీసం దొంగ ఓటర్లను పోలీసు స్టేషన్‌కు కూడా తరలించిన పాపనపోలేదు. తిరుపతి కేంద్రంగా దొంగ ఓట్ల దందా దశాబ్దాకాలంపైగా బహిరంగంగానే జరుగుతున్న ప్రశ్నించే వాడు లేడు, ఒక వామపక్షాలు తప్పా. ఎంఎల్‌సి ఎన్నికల్లోనే ఇదే తంతు…! ఉపాధ్యాయ, పట్టాభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా ఇదే తంతు. ఏకంగా సంతకం కూడా రానీ నిశాని పట్టాభద్రుడి ఓటరుగా నమోదైన ఘటనలు అనేకం. ఐదో తరగతి కూడా చదవని వ్యక్తి పట్టాభద్రుడుగా ఓటుహక్కు వినియోగించుకోవడం సాక్షాత్తు మీడియానే బహిర్గత పరిచింది. స్కూల్‌ మోహం కూడా చూడని వారు ఉన్నత చదువులు చదివారనేలా అధికార పార్టీ వ్యవహరించిన తీరు తిరుపతివాసులకు కెరుకే. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అయితే సాక్షత్తు ఎన్నికల అధికారి కార్యాయలం గేటు వద్దే అధికార పార్టీ నాయకులు కాపుకాసి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ప్రత్యార్ధులపై దాడి చేయడం, వారి పత్రాలు చింపేయడం, వారిని కిడ్నప్‌ చేయడం, పోటీ దారులను భయబ్రాంతులకు గురి చేయడం అందరికి తెలిసిన వాస్తవం. పోలింగ్‌ సమయంలో అధికారపార్టీ నాయకులు మాత్రమే ఏజెంట్లు ఉంటూ మిగిలిన ఏజెంట్లను బయటకు పంపి అధికారుల అండతో ఓట్లు గుద్దుకున్నారన్న ఆరోపణలు పెలుబిక్కాయి. ఇక సంస్థాగత ఎన్నికల్లో జరిగిన ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని, అన్ని ఏకగ్రీవాలే, ప్రజలు, వామపక్షాలు తిరగబడిన ప్రాంతాల్లో తూతుమంత్రంగా కొన్ని స్థానాల్లో మాత్రం ఎన్నికలు జరిపాము అనిపించుకున్నారు. ఇలా రాజ్యాంగాన్ని పాలకులు తమ చేతుల్లోకి తీసుకుని, అన్ని తామే అనేలా వ్యవహరిస్తే ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది. కనీసం ఎన్నికలైన పకడ్బందిగా, పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు నచ్చిన వారిని ఎన్నుకునే ఎన్నికలు సక్రమంగా జరగాలని పలువురు నిపుణులు, ప్రజలు కోరుకుంటున్నారు.

➡️