జూనియర్‌ లైన్‌మెన్లకు ‘రెగ్యులర్‌ స్కేల్‌’ ఇవ్వాలి

Jan 19,2024 22:03
జూనియర్‌ లైన్‌మెన్లకు 'రెగ్యులర్‌ స్కేల్‌' ఇవ్వాలి

ప్రజాశక్తి-తిరుపతి సిటి గ్రేడ్‌2 లైన్‌మెన్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో యుఈఈయు, యుఈసిడబ్ల్యుయు మద్దతుతో శుక్రవారం మహాధర్నా చేపట్టారు. తిరుపతిలోని ఎస్‌పిడిసిఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద నాలుగు జిల్లాలకు చెందిన గ్రేడ్‌2 లైన్‌మెన్లు వందలాది మంది హాజరై నడిరోడ్డుపై మండుటెండలో బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. కార్మికులు మహాధర్నా చేపడతారని ముందుగానే తెలుసుకున్న యాజమాన్యం వందలాది మంది పోలీసులను డిస్కం కార్యాలయం, ఎస్‌ఈ కార్యాలయం వద్ద మోహరింప చేశారు. 10 గంటలకు కార్మికుల ధర్నా అని ప్రకటిస్తే ఉదయం 8 గంటలకే పోలీసులు సుమారు 200 మంది డిస్కం వద్దకు చేరుకుని కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్‌వేలు కట్టి, కట్టుదిట్టమైన భద్రతతో పహారా కాశారు. వివిధ జిల్లాల నుంచి తిరుపతికి చేరుకున్న కార్మికులు శ్రీనివాస కల్యాణమండపాల నుంచి ర్యాలీగా డిస్కం ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మహాధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళీ మాట్లాడుతూ గ్రేడ్‌2 లైన్లమెన్లది న్యాయమైన పోరాటం అన్నారు. ఎలక్ట్రికల్‌ సంస్థ నోటీఫికేషన్‌ ద్వారా గ్రేడ్‌2 పోస్టులు భర్తీ చేశారని, వారికి ఎలక్ట్రిసిటి వర్తింప చేసేవి అన్ని వర్తింప చేయాలన్నారు. నెలకు 22 వేల చొప్పన వేతనాలు ఇవ్వడం కాదని, రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చే స్కేల్‌ ప్రకారమే జీతాలు ఇవ్వాలన్నారు. గ్రేడ్‌2 లైన్‌మెన్లు ధర్నా అంటే టిఏ బిల్లులను విడుదల చేస్తున్నట్లు గురువారం అధికారులు ప్రకటించారని, ప్రశ్నిస్తే తప్ప సమస్యలు పరిష్కరం అయ్యేలా కనబడటం లేదన్నారు. ఎలక్ట్రిసిటి రంగం ప్రస్తుతం లక్ష కోట్లు అప్పుల్లో ఉందని, ఈ అప్పులన్నీ కార్మికులు, ఉద్యోగులు, లైన్‌మెన్లు వారి సమస్యల పరిష్కారం కోసం కాదని, అంబానీ, అదాని జేబులు నింపేదుకేనని ధ్వజమెత్తారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ ఎనర్జీగా ఉండాల్సిన ఎనర్జీ అసిస్టెంట్లు ప్రభుత్వ అరాకొర జీతాలతో కనీసం కడుపునిండా తిండి తినలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. యుఈఈయు రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజేషన్‌ చేయాలని, తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి డైరెక్ట్‌ పేమెంట్‌ కల్పించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రావలసిన అరియర్స్‌ అమౌంట్‌ వెంటనే ఇప్పించాలని డిమాండు చేశారు. లైన్‌మెన్లుకు ఇస్తున్న వాటిని గ్రేడ్‌2 లైన్‌మెన్లుకూ అమలు చేయాలని కోరారు. యుఈఈయు నాయకులు పెంచల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రేడ్‌2 లైన్‌మెన్లు సచివాలయం ఉద్యోగులా, విద్యుత్‌ సంస్థకు చెందిన ఉద్యోగులా అనేది తెలియని తికమక పరిస్థితుల్లో వారిని నెట్టడం సరైనది కాదన్నారు. విద్యుత్‌ సంస్థ వేతనాలు చెల్లిస్తూ, మీరు సచివాలయం ఉద్యోగులు అనే విధంగా వారిని రెండిటికి చెడ్డ రేవులా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కం అధ్యక్షులు శివశంకర్‌ మాట్లాడుతూ ఎలక్ట్రిసిటిలో పని చేస్తున్న ఉద్యోగులను రెండు రకాలుగా విభజించిన పరిస్థితి నేడు నెలకొందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత ఏడాది డిసెంబరు 28న అధికారులకు నోటీసులు ఇచ్చామని, ఇప్పటి వరకు పరిష్కరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌పిడిసిఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రసూల్‌ అహ్మద్‌, మునిరాజా, సుమన్‌, సుదీర్‌, తేజ, సునీల్‌ పాల్గొన్నారు.

➡️